అదే మాట: జయ ఆరోగ్యంపై అపోలో వైద్యుల హెల్త్ బులిటెన్ విడుదల
చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గత రెండు రోజులుగా అందిస్తున్న చికిత్సనే ఆమెకు కొనసాగిస్తున్నామని వైద్యుల బృందం వెల్లడించింది. ట్రీట్‌మెంట్‌కు జయలలిత స్పందిస్తున్నారని పేర్కొన్నారు.
జయకు ట్రీట్‌మెంట్‌ను కొనసాగిస్తున్నామని అపోలో వైద్య బృందం పేర్కొంది. కాగా, ప్రస్తుతం జయ వెంటిలేషన్ పైనే ఉన్నారు. ప్రత్యేక బృందం జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. చికిత్స నిమిత్తం మరికొన్ని రోజులు జయలలిత ఆస్పత్రిలోనే ఉండాలని సూచించామని అపోలో వైద్యులు ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు.
గత 14 రోజులుగా జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జయలలిత ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. 'అమ్మ' ఆరోగ్య వివరాలను కోరుతూ ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారించింది.

దీంతో జయలలిత ఆరోగ్య స్థితిపై బుధవారం లోగా పూర్తి నివేదిక అందజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఎం ఆరోగ్యంపై నివేదికను రాతపూర్వకంగా లేదా మౌఖికంగా బుధవారం కోర్టులో సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.
మరోవైపు జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు ముమ్మరం చేశారు. సోమవారం పెరంబూరు ఎమ్మెల్యే పి. వెట్రివేల్ నేతృత్వంలో 10 వేల మంది మహిళలు పాలకుండలు, కావళ్లు మోస్తూ సుబ్రమణ్యస్వామి ఆలయం నుంచి శేనియమ్మన ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
పలువురు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శరీరంలో సుబ్రమణ్యస్వామి శూలాలు గుచ్చుకొని జయ క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. కాగా జయ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications