జయలలితని ఎందుకు చూడనివ్వట్లేదంటే? 52కేసులు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వర్గాలు ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎప్పటికప్పుడు చెబుతోంది. అయితే ఆమెను చూసేందుకు మాత్రం అనుమతించడం లేదు. దీంతో అభిమానుల్లో, కార్యకర్తల్లో ఆందోళన కనిపిస్తోంది.
జయలలితను చూడనివ్వకపోవడానికి ఓ కారణం ఉందని చెబుతున్నారు. ఆమెకు చికిత్స అందిస్తున్న ఐసీయులోకి వైద్యుల అనుమతి లేకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా లోపలకి వెళ్తే ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశముందని, అందుకే అందరినీ అనుమతించడం లేదంటున్నారు.
జయలలిత గత నెల 22వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. అయితే ఆమె చికిత్సకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు మాత్రం మీడియాలో రావడం లేదు.

జాతీయ పార్టీల నేతలు రాహుల్ గాంధీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలు ఆమెను పరామర్శించిన సమయంలోని ఫోటోలు కూడా మీడియాకు చిక్కలేదు. ఈ నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు రానివ్వడం లేదని అంటున్నారు.
కాగా, జయలలిత కీలక బాధ్యతలను ఆర్థికశాఖ మంత్రి పన్నీరు సెల్వంకు అప్పజెప్పటంపై ప్రతిపక్షాలు పలు సందేహాలను లేవనెత్తిన విషయం తెలిసిందే. జయ వద్ద ఉన్న ఎనిమిది కీలక శాఖలను ఆమె మౌఖిక ఆదేశాల ద్వారా బుధవారం పన్నీరు సెల్వంకు అప్పజెప్పారు. ఈ విషయాన్ని జయ అధికార ప్రతినిధి సరస్వతి తెలిపారు.
జయలలిత కీలకమైన హోంశాకతో పాటు రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రజా సంబంధాల శాఖను తన వద్దే ఉంచుకొని నిర్వహిస్తున్నారు. ఆమె ఆసుపత్రిలో ఉండటంతో ఉప ముఖ్యమంత్రి లేదా ఆపద్ధర్మ సీఎం వాదనలు బయటకు వచ్చాయి. వీటన్నిని పక్కన పెట్టి పన్నీరు సెల్వంకు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
మరోవైపు, గతనెల 22 నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వదంతులు ఆగడం లేదు. సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులకి ఫుల్ స్టాప్ పెట్టడానికి అన్నాడీఎంకే నేతలు అదే సోషల్ మీడియా ద్వారానే 'మై సీఎం ఈజ్ ఫైన్.. నో మోర్ రూమర్స్' అనే హ్యాష్ ట్యాగ్‌లతో ట్విట్టర్‌లో ప్రచారాన్ని ప్రారంభించారు.
అయినా పలువురు వదంతులను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యంపై అభ్యంతరకర పోస్టులు చేసిన మరో ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తంగా తమిళనాడులో బుధవారం నాటికి 52 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications