కుట్రస్థానం పోయెస్ గార్డెన్, జయే మాస్టర్ మైండ్: సుప్రీం కీలక వ్యాఖ్యలివే
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పులో భాగంగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇతర నిందితులపై తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
న్యూఢిల్లీ/చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పులో భాగంగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇతర నిందితులపై తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జయపైనా ఘాటైన వ్యాఖ్యలు ఉన్నాయి. చెన్నైలో ఆమె నివాసమైన పోయెస్ గార్డెనే కుట్రకు స్థానమనీ, పన్నాగమంతా అక్కడే రూపుదిద్దుకొందని ధర్మాసనం తెలిపింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలితే మాస్టర్‌మైండ్ అని సుప్రీంకోర్టు తేల్చింది. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన తీర్పును వెలువరించిన సుప్రీం మాజీ సీఎం జయలలిత ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబట్టేందుకు జయ తన స్నేహితురాలు శశికళతో కలిసి పెద్ద పన్నాగమే వేసినట్లు కోర్టు తన తీర్పులో పేర్కొంది.
పోయెస్ గార్డెన్ వేదికగానే చాలా లోతైన కుట్ర కొనసాగినట్లు కోర్టు తెలిపింది. అక్రమ ఆస్తులను బినామీ పేర్లతో స్థిరాస్తులుగా మార్చేందుకు కుట్ర జరిగినట్లు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జయ తన స్నేహితురాలు శశికళను పోయెస్ గార్డెన్‌లో పెట్టుకోలేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. అక్రమాస్తులు కేసులో జయతో పాటు శశికళ, ఇలవరసి, సుధాకరన్ దోషులుగా ఉన్నారు. 1991లో రెండు కోట్లు ఉన్న జయ ఆస్తులు 1996లో 65 కోట్లుగా మారిందని కోర్టు తన తీర్పులో ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

తెలివిగా మార్చేశారు..
బ్యాంకుల ద్వారా అక్రమాస్తులను తెలివిగా జయలలిత మార్చేశారని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. తక్కువ ధరకే వేల ఎకరాల భూమిని జయ సొంతం చేసుకున్నదని కోర్టు తెలిపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నలుగురికి ఎందుకు శిక్ష విధించామన్న విషయాన్ని కూడా కోర్టు తన తీర్పులో స్పష్టంగా వెల్లడించింది. జయ పబ్లికేషన్స్ విషయంలో శశికళకు పవర్ ఆప్ అటార్నీ జయలలితే జారీ చేసినట్లు కోర్టు గుర్తించింది.

జయ ఆస్తులు శశికళే చూసుకునేవారు..
జయ పబ్లికేషన్స్‌కు వచ్చే ఆదాయాలను శశికళే చూసుకునే విధంగా జయ ఏర్పాట్లు చేసినట్లు కోర్టు పేర్కొన్నది. జయ పబ్లికేషన్స్‌లో తన అకౌంట్‌కు వస్తున్న ఫండ్స్‌ను శశికళే చూస్తున్నదన్న విషయం తమిళనాడు మాజీ సీఎంకు తెలుసు అని కోర్టు స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో ఉన్న నిందితులు అందరూ చాలా వేగంగా కొత్త కొత్త కంపెనీలను సృష్టించారని కోర్టు వెల్లడించింది.

ఒక్కరోజులోనే 10 కంపెనీలు..
ఒక్క రోజులోనే నిందితులు 10 కంపెనీలు సృష్టించినట్లు ఆధారాలున్నాయని సుప్రీం కోర్టు పేర్కొన్నది. శశికళ గురించి కానీ, పోయెస్ గార్డెన్‌లో ఏం జరుగుతుందన్న విషయం తనకు తెలియదని మాజీ సీఎం జయలలిత చెప్పడాన్ని కోర్టు ఓ అబద్దంగా చిత్రీకరించింది. అక్రమాస్తుల కేసులో ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అందించిన స్పెషల్ జడ్జి జాన్ మైఖేల్ కన్హాపై కోర్టు ప్రశంసలు కురిపించింది.

జయ, శశికళ కుట్రలు
ప్రజాసేవకురాలై ఉండి జయలలిత తన ఆదాయానికి మించిన ఆస్తుల్ని సముపార్జించడానికి ఇతర నిందితులతో కుట్ర పన్నారనీ, వాటిని శశికళకు పంపిణీచేశారనీ పేర్కొంది. జయ ఖాతానుంచి శశి ఖాతాకు నిధుల ప్రవాహాన్ని చూస్తే వారంతా కలిసే దీనికి పాల్పడినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. అక్రమ ఆదాయాన్ని కంపెనీల పేరిట ఆస్తులుగా మార్చుకునేందుకు ఆమె కుట్ర పన్నారని స్పష్టం చేసింది. కుట్రలో శశికళ, సుధాకరన్, ఇళవరసి చురుగ్గా పాల్గొని జయ అక్రమ సంపాదనను వ్యక్తిగత లబ్ధికి, ఆస్తుల సముపార్జనకు ఉపయోగించుకున్నారని స్పష్టం చేసింది. ధర్మాసనం చేసిన కొన్ని

సుప్రీం కీలక వ్యాఖ్యలు..
అమ్మకందారులపై ఒత్తిళ్లు తీసుకువచ్చి నిందితులంతా మార్కెట్ విలువ కంటే ఎంతో తక్కువకే ఆస్తుల్ని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా జయ నివాసానికే వెళ్లి ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. పోయెస్ గార్డెన్ నివాసం నుంచే 12 డొల్ల కంపెనీలు నడిచినా అది జయలలితకు తెలియదనడం ఆమోదయోగ్యం కాదు. జయ కోసం ఆస్తుల్ని సముపార్జించడానికి శశికళ ఆమెతో కలిసి పోయెస్‌గార్డెన్ నివాసంలోనే ఉండేవారు. వారి మధ్య ఎలాంటి రక్తసంబంధం లేదు. జయ సమకూర్చిన నిధులతో శశి, మరో ఇద్దరు భారీగా భూములు సమీకరణకు సంస్థల్ని ఏర్పాటు చేయడం వాస్తవం. వారంతా పోయెస్ గార్డెన్‌లో చేరారంటే ఏ సేవా కార్యక్రమం చేపట్టడానికో, మానవతా దృక్పథంతోనో కాదని స్పష్టమవుతోంది. ఆస్తుల సముపార్జనకు కుట్ర పన్నడానికే వారికి అక్కడ చోటు లభించిందనేది నిస్పందేహం. కుట్రనునేరుగా రుజువు చేయలేం. అయితే పరిస్థితులు దీనిని బలపరుస్తున్నాయి.

శశికళ సహ కుట్రదారు
జయ, శశి ఒకరికొకరు ఏజెంట్లు. జయకు పవరాఫ్ అటార్నీగా ఉన్న శశి అమెకు సహ కుట్రదారు కూడా. ఎప్పటికప్పుడు శశి ఇచ్చే ఆదేశాలను పాటించాలని జయ తమవారికి ఆదేశాలిచ్చారు. భారీ నగదు డిపాజిట్లు ఏ ఖాతాలో జమ చేయాలో శశికళ నిర్ణయించేవారు. ఖాతాల మధ్య మార్పిడి జరిగిన భారీ సొమ్మును చూస్తే దాని మూలమంతా చెన్నైలోని పోయెస్‌గార్డెన్ నుంచే ఉందనేది స్పష్టం. ఎలా చూసినా ఈ ఖాతాలన్నీ ఒకటనే భాష్యం చెప్పాలి.

జయ పాత్రే కీలకం
శశి ఎంటర్‌ప్రైజెస్‌కు జయలలిత కోటి రూపాయల్ని వాటాధనంగా మళ్లించారు. దానిని గతంలో ఆమే అంగీకరించారు. అందువల్ల ఈ సంస్థల్లో తన పాత్ర లేదని ఆమె చెప్పుకోజాలరు. జయ ఖాతాల నుంచి తరచూ నిధులు శశి ఖాతాలోకి మళ్లాయి. ఒకే బ్యాంకుకు చెందిన వేర్వేరు ఖాతాల నుంచి నిధులు జమ అయ్యేవి. అందువల్ల దీనిని మరో విధంగా చూడలేం. సహ నిందితులు తమకు విడిగా ఆదాయ వనరులున్నాయని చెబుతున్నా, కంపెనీలను ఏర్పాటు చేసిన తీరు, భూముల్ని కొన్న విధానం చూస్తే వారి మధ్య ఎలాంటి కుట్ర ఉందో తేటతెల్లం అవుతోంది.

జమ మరణించినా.. మిగితా వారికి శిక్ష తప్పదు..
దాయానికి మించిన ఆస్తులు 8.12 శాతమేనని కర్ణాటక హైకోర్టు వేసిన లెక్క పూర్తిగా తప్పు. తప్పుడు సమాచారం ఆధారంగా వేసిన అసంబద్ధమైన అర్థగణిత లెక్కలు అవి. సాక్ష్యాల ఆధారంగా విచారణ న్యాయస్థానం లేవనెత్తిన కారణాలు, అక్కడ వెలువడిన తీర్పులోని అంశాలు సహేతుకంగా, సరైనవిగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత తన ఆదాయానికి మించిన ఆస్తుల్ని నిందితులతో కలిసి సమకూర్చుకున్నారు. వాటిని శశి, తదితరులకు పంపిణీ చేశారు. దాని కోసమే డొల్ల కంపెనీలను వినియోగించుకున్నారు. ఒక ముసుగు తొడుక్కొని తన తరఫున వారి పేరిట జయ ఈ ఆస్తులు సంపాదించారు. జయా పబ్లికేషన్లకు శశిపేరిట జనరల్ పవరాఫ్ అటార్నీని జయలలితే ఇచ్చారు. న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికే ఆమె ఆ విధంగా చేశారు. శశి ఖాతాలోకి జయే నిధులు జమ చేసేవారు. జయ మరణించినా మిగిలిన ముగ్గురు నిందితులు శిక్ష అనుభవించాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications