జెట్ ఎయిర్‌వేస్ ఇక కనుమరుగు.. ఆస్తుల విక్రయంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశం!
అసలు నిజాలను పూర్తిగా పరిశీలించకుండా జలాన్-కర్లాక్ కన్షార్షియానికి అనుకూలంగా తీర్పు వెలువరించారంటూ నేషనల్ లా ట్రిబ్యునల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జెట్ ఎయిర్‌వేస్ విమానయాన సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్థిక కష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్‌వేస్ ప్రస్థానం ముగిసినట్లయింది. దివాలా పరిష్కార ప్రయత్నాలు విఫలమవ్వడంతో.. రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
బిడ్డింగ్‌లో చేజిక్కించుకుని..
నిజానికి, జెట్ ఎయిర్‌వేస్ విమానయాన సంస్థ ఆర్థిక కష్టాలతో 2019 నుంచి తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు చేరింది. అక్కడ దివాలా పరిష్కార ప్రక్రియ మొదలవ్వగా.. అక్కడ బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్‌వేస్‌ను జలాన్- కర్లాక్ కన్సార్షియం చేజిక్కించుకుంది. ఆ తర్వాత కన్సార్షియానికి, రుణదాతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతలు ఎన్‌సీఎల్‌టీకి వెళ్లారు. యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్ ట్రైబ్యునల్ సైతం సమర్థించింది.

ఆ తీర్పును పక్కనపెట్టి..
దీంతో ఆ తీర్పునకు వ్యతిరేకంగా ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది. గతంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఆ తీర్పును పక్కనపెట్టింది. దివాలా పరిష్కార ప్రక్రియలో విమానయాన సంస్థను సొంతం చేసుకున్న జలాన్-కర్లాక్ కన్షార్షియం తర్వాత ఉద్యోగుల జీత భత్యాలు, నిధులు వెచ్చించడంలో విఫలమైందని తెలిపింది. ఈ కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించి లిక్విడేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో జెట్ ఎయిర్‌వేస్ ఆస్తులను నగదుగా మార్చేందుకు మార్గం సుగమమైంది.












Click it and Unblock the Notifications