దారుణం: బీజేపీ నేత కూతురు దారుణ హత్య, చెట్టు వేలాడదీశారు, కన్ను బయటికిలాగినట్లు..
రాంఛీ: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన ఓ బీజేపీ నేత కుమార్తె అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన కుమార్తె.. విగతజీవిగా కనిపించడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పలాం జిల్లాలోని బుదాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడికి ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె(16) పదవ తరగతి చదువుతోంది. జూన్ 7న ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లాలిమతి అటవీ ప్రాంతంలో బుధవారం చెట్టుకు వేలాడుతూ యువతి మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహం అదృశ్యమైన బీజేపీ నాయకుడి కుమార్తెగా గుర్తించారు. అయితే, ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. కళ్లు బయటికి పీకివేసినట్లు గుర్తించారు. ఆమె దుస్తులు కూడా చిరిగిపోయి ఉన్నాయి.
తన కుమార్తెను దుండగులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇలా చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. గత కొంతకాలంగా మృతురాలితో సన్నిహితంగా ఉండే ప్రదీప్ కుమార్ సింగ్ ధనుక్(23)ను అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసివుంటారని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications