పితృ పక్షం పూర్తయిన వెంటనే కీలక ప్రకటన చేయబోతోన్న బీజేపీ
Jharkhand assembly election 2024: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జార్ఖండ్. మహారాష్ట్రతో కలిసి ఒకేసారి పోలింగ్ జరగాల్సి ఉంది ఇక్కడ. ప్రస్తుతం హర్యానాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది.
జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది కూడా. చివరి విడత ఎన్నికలు అక్టోబర్ 1న షెడ్యూల్ అయ్యాయి. హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే జార్ఖండ్, మహారాష్ట్రల అసెంబ్లీ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 41. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు, ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.
ఈ క్రమంలో బీజేపీ మరోసారి పొత్తులనే నమ్ముకుంది. ఈ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, జనతాదళ్ (యునైటెడ్)తో కలిసి పోటీ చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ కో- ఇన్‌ఛార్జ్ హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ రెండు పార్టీలతో సీట్ల పంపకాల ప్రక్రియ తుదిదశలో ఉందని పేర్కొన్నారు. ఒకట్రెండు సీట్ల మీద అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు.
సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు సజావుగా, సుహృద్భావ వాతావరణంలో సాగుతున్నాయని హిమంత చెప్పారు. త్వరలోనే పూర్తవుతాయని, ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. పితృపక్ష రోజులు పూర్తయిన వెంటనే అంటే అక్టోబర్ 2వ తేదీ తరువాత సీట్ల పంపకాల మీద అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications