కమల్‌నాథ్‌కు ఉద్వాసన: కొత్త పీసీసీ చీఫ్ అపాయింట్
Kamalnath: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. కీలక నిర్ణయాలను తీసుకుంది. రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకత్వంలో ప్రక్షాళన చేపట్టింది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లల్లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు కొత్త సారథులను ప్రకటించింది. ఇప్పుడున్న అధినేతలపై వేటు వేసింది.
మధ్యప్రదేశ్ పీసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను పదవి నుంచి తప్పించింది. ఆయనకు ఉద్వాసన పలికింది. కమల్‌నాథ్ సారథ్యంలోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది కాంగ్రెస్. ఘోర పరాజయాన్ని చవి చూసింది. వరుసగా రెండోసారి కూడా ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

దీనితో ఆయనపై వేటు వేసింది. యువరక్తానికి ప్రాధాన్యత ఇచ్చింది. కమల్‌నాథ్ స్థానంలో సీనియర్ నేత జీతు పట్వారి (Jitu Patwari)ని పీసీసీ అధ్యక్షుడిగా అపాయింట్ చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనను ఈ పదవి కోసం ఎన్నుకుంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు జీతూ పట్వారి. 35 వేలకు పైగా ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో మట్టికరిచారు. అయినప్పటికీ- ఆయనపై పూర్తి విశ్వాసాన్ని ఉంచింది కాంగ్రెస్ హైకమాండ్. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓబీసీ నేతకు పీసీసీ పట్టం కట్టినట్టయింది.
ఛత్తీస్‌గఢ్‌లోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ నేత దీపక్ బైజ్‌ను ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ప్రతిపక్ష నేత బాధ్యతలను చరణ్ దాస్ మహంతకు అప్పగించింది. మొన్నటి ఎన్నికల్లో చిత్రకూట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దీపక్ బైజ్ ఓడిపోయారు.












Click it and Unblock the Notifications