Jobs for land case: లాలూ ప్రసాద్ యాదవ్‌ను 9 గంటలపాటు విచారించిన ఈడీ
పాట్నా: బీహార్ రాష్ట్రంలో జరిగిన 'ల్యాండ్ ఫర్ జాబ్' మనీలాండరింగ్ కుంభకోణంలో విచారణకు హాజరైన ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సుదీర్ఘంగా విచారించింది. సుమారు 9 గంటలకుపైగా ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు, లాలూ ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
సోమవారం ఉదయం 11:00 గంటల ప్రాంతంలో విచారణ కోసం పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న లాలూ రాత్రి 8:50 గంటలకు బయటకు వచ్చారు. ఈ సమయంలో ఆయనతో కుమార్తె మిసా భారతి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న లాలూకు మద్దతుగా భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఆదివారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మరుసటిరోజే ఈ పరిణామం జరగడం వల్ల అక్కడి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బాగా లేకున్నా.. కేంద్రం వేధింపులు ఆగడం లేదని ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు.
లాలూ ప్రసాద్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనను ఇన్ని గంటలపాటు విచారించకుండా ఉండాల్సింది. ఇది ఆయన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు అని ఆర్జేడీ నేత లలిత్ యాదవ్ అన్నారు. ఆర్జేడీ మహిళానేత ఎజ్యా యాదవ్ మాట్లాడుతూ.. ఈడీ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం చేప్పినట్లుగా వ్యవహరిస్తోందని, ఈడీ అనేది ప్రస్తుతం ఒక జోక్‌గా మారిందని ధ్వజమెత్తారు. అయితే ఈడీ సొంతంగా పనిచేస్తే లాలూపై ఇలాంటి ఆరోపణలు వచ్చేవి కాదన్నారు.












Click it and Unblock the Notifications