వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోషీమఠ్: కుంగిపోతున్న ఈ నగరానికి మహాభారతానికి ఏంటి సంబంధం?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జోషీమఠ్

ఇంగ్లిష్ ఐసీఎస్ అధికారి హెచ్‌జీ వాల్టన్ 1910లో రాసిన ''ద గజెటీర్ ఆఫ్ గఢ్‌వాల్ హిమాలయాస్’’ పుస్తకంలో జోషీమఠ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

''అప్పట్లో ఇక్కడ కొన్ని రాళ్లతో నిర్మించిన ఇళ్లు, రాత్రిపూట పడుకునేందుకు సత్రాలు, దేవాలయాలు ఉండేవి. వ్యాపారులతో ఇక్కడి వీధులు కళకళలాడేవి. జడలబర్రెల మెడలోని గంటలు, గుర్రాల పరుగుల శబ్దాలు ఇక్కడ వినిపించేవి. ఇక్కడి ప్రజలకు టిబెట్‌తోనూ వాణిజ్య సంబంధాలు ఉండేవి’’అని పుస్తకంలో ఆయన రాసుకొచ్చారు.

అప్పట్లో వ్యాపారుల లావాదేవీలతో జోషీమఠ్ ఒక వ్యాపార కేంద్రంగా కొనసాగేది. అయితే, వాల్టన్ కాలంలోనే కొందరు వ్యాపారులు తమ మండీలను దక్షిణానికి అంటే నందప్రయాగ్‌కు తరలించేవారు.

ఇక్కడి భోటియా విపణిని టిబెట్‌లోని జ్ఞానిమా మండీతో వాల్టన్ పోల్చారు. జ్ఞానిమా మండీలో ఏడాది పొడవునా వాణిజ్య కార్యకలాపాలు జరుగుతుండేవి.

జోషీమఠ్

అలకనంద నదికి ఎగువన కనిపించే జోషీమఠ్ జనాభా 1872లో 455 మంది. 1881నాటికి ఇది 572కు పెరిగింది.

అయితే, సెప్టెంబరు 1900లో ఈ సంఖ్య 468గా జనాభా లెక్కల్లో పేర్కొన్నారు. అయితే, ఆ సారి జనాభా లెక్కలు చేపట్టిన సమయంలో బద్రీనాథ్ ఉద్యోగులు ఇక్కడ లేరు.

యాత్ర సమయంలో వీరు బద్రీనాథ్‌కు వెళ్తారు. అక్కడకు వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

శీతాకాలంలో బద్రీనాథ్ ఉద్యోగులంతా జోషీమఠ్‌కు వచ్చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో బద్రీనాథ్‌లో విపరీతంగా మంచుకురుస్తుంది. ఫలితంగా దేవాలయం తలుపులు మూసేస్తారు.

కర్ణప్రయాగ్ నుంచి టిబెట్‌కు వెళ్లే మార్గం చమోలీ, జోషీమఠ్, బద్రీనాథ్‌ల గుండా వెళ్లి మానస్ పాస్‌కు కలుస్తుంది. అయితే, ఇక్కడ మరో మార్గం తపోవన్, మలారీల గుండా వెళ్లే నీతి పాస్‌తో కలుస్తుంది.

రావల్ ప్రజలతోపాటు బద్రీనాథ్ ఉద్యోగుల శీతాకాల విడిదిగా జోషీమఠ్ మొదట్లో ఉండేవారు. అయితే, నెమ్మదిగా మానస్, నీతీ లోయల్లోని మారుమూల ప్రాంతాల నుంచి గఢ్‌వాల్‌లోని భిన్న ప్రాంతాలకు వచ్చే ప్రజలకు విడిది కేంద్రంగా మారింది.

జోషీమఠ్

జోషీమఠ్ కథ ఇదీ

సముద్ర మట్టానికి 6,107 అడుగుల ఎత్తులో ఉత్తరాఖండ్‌లో ధౌలీ, విష్ణు గంగల సంగమానికి అర కిలోమీటర్ దూరంలో జోషీమఠ్ ఉంటుంది.

8వ శతాబ్దంలో ఆది శంకరాచార్య రాకతో ఇక్కడ మతపరమైన మార్పులు చాలా వచ్చాయి.

దక్షిణాది రాష్ట్రం కేరళలోని ట్రావంకోర్‌లో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన శంకరాచార్య వేదాంత సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషిచేశారు.

దీనిలో భాగంగానే ఆయన దేశంలోని భిన్న ప్రాంతాలతోపాటు హిమాలయాల్లోనూ పర్యటించారు. ఇక్కడ ఆయనకు చాలా మంది అనుచరులు కూడా ఉన్నారు.

తన అనుచరుల కోసం దేశంలోని నాలుగు దిశల్లో శంకరాచార్య నాలుగు మఠాలను స్థాపించారు. తూర్పున పూరీలో వర్ధన మఠం, పశ్చిమాన ద్వారకలో శారద మఠం, దక్షిణాన మైసూరులో శ్రీంగేరి మఠం, ఉత్తరాన జ్యోతిర్‌మఠం అంటే జోషీమఠ్‌ను ఆయన ఏర్పాటుచేశారు.

జోషీమఠ్ ఏర్పాటు తర్వాత, ధ్వంసమైన బద్రీనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ తర్వాత ఆయన కేదార్‌నాథ్ వెళ్లారు. అక్కడే 32 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.

జోషీమఠ్

ఆది శంకరాచార్యకు ఇక్కడే జ్ఞానోదయం

ఆధునిక హిందూయిజంలో గొప్ప మతబోధకుడిగా పరిగణించే వారిలో ఒకరైన ఆది శంకరాచార్యకు జోషీమఠ్‌లోని ఒక చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు చెబుతారు.

అందుకే ఈ ప్రాంతాన్ని జ్యోతిర్‌ధామ్ అని కూడా పిలుస్తారు. ఆ చెట్టు నేటికీ ఇక్కడ కనిపిస్తుంది. దీన్నే కల్పవృక్షంగా పిలుస్తారు.

అయితే, ఈ చెట్టుకు పక్కనే ఉండే దేవాలయం నేడు కుంగిపోయింది. దీని పక్కనే ఉండే గుహ కూడా ధ్వంసమైంది. ఇక్కడే ఆది శంకరాచార్య ధ్యానం చేసినట్లుగా చెబుతారు.

జోషీమఠ్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడే లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం కూడా ఉంది. ఆయన భక్తుడు ప్రహ్లాదుడు ఇక్కడ మోక్షం పొందినట్లుగా చెబుతారు.

ఇక్కడ చాలా దేవాలయాలతోపాటు నీటి ఊటలు కూడా ఉన్నాయి. ఇవి కూడా దేవుళ్ల పేర్లతోనే కనిపిస్తాయి. బ్రహ్మ కుండ్, విష్ణు కుండ్, గణేశ్ కుండ్, రిషీ కుండ్, సూర్య కుండ్, ప్రహ్లాద్ కుండ్.. ఇలా చాలా ఉన్నాయి.

జోషీమఠ్

కుమావూ, గఢ్‌వాల్‌లతో

కుమావూ-గఢ్‌వాల్‌ల చరిత్రలో జోషీమఠ్‌కు ప్రత్యేక స్థానముంది. ఈ హిమాలయ ప్రాంతాన్ని పాలించిన కత్యూరీ రాజ్యం తొలి రాజధాని జ్యోతిర్‌ధామ్.

కత్యూరీ చక్రవర్తి శ్రీవాసుదేవ్ గిరిరాజ చక్ర చూడామని అలియాస్ రాజా వాసుదేవ్ హయాంలో జ్యోతిర్‌ధామ్ ప్రధాన కేంద్రంగా మారింది. ఆ తర్వాత కాలంలో రాజధానికి కుమావూకు సమీపంలో బైజ్‌నాథ్‌కు మార్చారు.

అసలు బైజ్‌నాథ్‌కు రాజధానిని ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.

ఒక రోజు రాజా వాసుదేవ్ వేటకు వెళ్లారు. అప్పుడే నరసింహమూర్తి మనిషి అవతారంలో ఇక్కడకు భిక్షాటనకు వచ్చారు. ఆయనను గుర్తించిన రాణి అతిథి మర్యాదలు చేశారు. రాజు మంచంపై ఆయన నిద్రపోయేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.

రాజు వచ్చి చూసేవారికి ఒక భిక్షం ఎత్తుకునే వ్యక్తి మంచంపై పడుకుని కనిపించారు. వెంటనే అతడిపై తన కత్తితో రాజు దాడి చేశారు.

అయితే, మనిషి రూపంలో కనిపిస్తున్న నరసింహమూర్తి చేతి నుంచి రక్తానికి బదులుగా పాలు కారడం మొదలైంది. వెంటనే రాజు భయపడి రాణిని పిలిచి ఆయన ఎవరని అడిగారు.

సాక్షాత్తు దేవుడే మనిషి రూపంలో వచ్చాడని చెప్పడంతో.. తను చేసిన తప్పుకు శిక్ష విధించాలని రాజు అతడిని కోరాడు.

తప్పు చేసినందుకు తను జ్యోతిర్‌ధామ్ వదిలి బైజ్‌నాథ్ వెళ్లిపోవాలని రాజుకు నరసింహమూర్తి ఆదేశించారని చెబుతారు.

''ఇక్కడ దేవాలయంలో నా విగ్రహం చేతికి కూడా గాయం కనిపిస్తుంది. నా విగ్రహాన్ని ధ్వంసం చేసి, చేయిని విడదీసిన రోజు నీ రాజ్యం కూడా ధ్వంసమవుతుంది. మొత్తంగా నీ రాజ్యమే కూకటివేళ్లతో పెకలించుకుపోతుంది’’అని కూడా నరసింహమూర్తి చెబుతాడు.

ఆ తర్వాత అక్కడి నుంచి నరసింహమూర్తి మాయం అవుతాడు. అతడి ఆదేశాలకు అనుగుణంగా రాజు ఇక్కడి నుంచి బైజ్‌నాథ్‌కు వెళ్లిపోయాడని చెబుతారు.

జోషీమఠ్

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌ మార్గంలో

గఢ్‌వాల్‌పై చరిత్రకారుడు శివప్రసాద్ డబ్రాల్ ఒక పుస్తకం రాశారు. దీనిలో మహాభారత కాలానికి ఆయన జోషీమఠ్‌తో ముడిపెట్టారు. పాణిని అష్టాధ్యాయి, మహాభారతంలో చెప్పిన కార్తికేయపురం ఇదేనని ఆయన రాసుకొచ్చారు.

నేడు జోషీమఠ్‌ను చూస్తే వాల్టన్ గజెటీర్‌లో ప్రస్తావించిన జోషీమఠ్ ఇదేనా అని సందేహం వస్తుంది.

ఇక్కడ 20వ శతాబ్దం పర్యటకం విపరీతంగా అభివృద్ధి చెందింది. సైలెంట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమ్‌కుండ్ సాహిబ్‌లకు ఈ ప్రాంతం మీద నుంచే వెళ్తుంటారు.

మరికొన్ని తీర్థయాత్రలకు వెళ్లేందుకు మొదటగా చాలామంది జోషీమఠ్‌కు వస్తుంటారు. ఇక్కడకు సమీపంలో ఔలీ కూడా స్కీయింగ్ రిసార్టుగా అభివృద్ధి చెందింది. ఇక్కడ 3915 మీ. పొడవైన రోప్‌వేను కూడా నిర్మించారు.

జోషీమఠ్

వ్యూహాత్మకంగా కీలకమైనది..

టిబెట్‌కు సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగానూ ఈ ప్రాంతం కీలకమైనది. దీంతో స్వాతంత్ర్ం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఇక్కడ భారీగా సైన్యం, సాయుధ బలగాలను మోహరించింది.

ఇక్కడి సాయుధ బలగాల్లో గఢ్‌వాల్ స్కౌట్స్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. సముద్ర మట్టానికి భారీ ఎత్తుల్లో ప్రత్యేక సైనిక ఆపరేషన్లు చేపట్టడంలో ఈ విభాగం ప్రత్యేక శిక్షణ పొందింది. దీని ప్రధాన కార్యాలయం కూడా జోషీమఠ్‌లోనే ఉంది.

2011 జనాభా లెక్కల ప్రకారం, జోషీమఠ్ జనాభా 17,000. కానీ, నేడు సైన్యం, ఇతర విభాగాలన్నింటినీ కలుపుకుని వెళ్తే ఇది 50,000కుపైనే ఉంటుంది.

బద్రీనాథ్‌కు వెళ్లే యాత్రికులతో ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుందని, ఇక్కడ వ్యాపారం అవకాశాలను దృష్టిలో ఉంచుకొని నాలుగు తరాలకు ముందే తమ కుటుంబం ఇక్కడ స్థిరపడినట్లు ముఖేష్ షా చెప్పారు.

చుట్టుపక్కల గ్రామాల్లో బంగాళ దుంపలు, రాజ్‌మా, గోధుమలు ఇలా చాలా పంటలు కూడా పండిస్తారు. ఇక్కడ పండించే పంటలను కొనుగోలు చేసేందుకు కోసం దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు.

హోటల్ సిబ్బంది, కూలీలు, కళాకారులు ఇలా చాలా మంది భిన్న ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తుంటారు.

ఇది మట్టి మాత్రమే..

అయితే, ఈ చారిత్రక నగరం రాళ్లపై కాకుండా ఒకప్పుడు పర్వత ప్రాంతాలు కుంగడంతో ఏర్పడిన మట్టి, చిన్నచిన్న గులకరాళ్లపై ఏర్పడిందని, అందుకే ఇక్కడ భూమి పెద్దపెద్ద నిర్మాణాలకు పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక్కడ పెద్దపెద్ద నిర్మాణాలు కట్టాలని చూస్తే, ప్రస్తుతం జరిగినట్లే నేల కుంగిపోతుందని వారు చెబుతున్నారు.

ఈ విషయంపై అర దశాబ్దం క్రితమే అప్పటి గఢ్‌వాల్ కమిషనర్ మహేశ్ చంద్ర మిశ్ర నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

1976లో ఈ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రణాళికలు లేకుండా నిర్మిస్తున్న ఇక్కడి భవనాలతో ప్రకృతిపై చాలా ప్రభావం పడుతోందని కమిటీ చెప్పింది.

ఇప్పుడు ఇక్కడ తపోవన్-విష్ణుగుండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వల్లే విధ్వంసం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఇక్కడి నేలకు సరిపోవవని వారు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Joshimath: What does Mahabharata have to do with this crumbling city?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X