నరేంద్ర మోడీ వచ్చాకే..: సోనాక్షి సిన్హా, తెలుగులో సిద్ధం...
జలంధర్/హైదరాబాద్: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా రాజకీయాలు, ప్రధాని నరేంద్ర మోడీ పైన మాట్లాడారు. తాను తన తండ్రి శతృఘ్ను సిన్హాతో రాజకీయాల పైన చర్చిస్తానని, అయితే, రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం మాత్రం లేదని చెప్పారు. తన దృష్టి అంతా సినిమాల పైనే అని చెప్పారు.
తాను ఎప్పటికీ రాజకీయాల్లో చేరనని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాకనే తనకు రాజకీయాల పైన ఆసక్తి పెరిగిందని చెప్పారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాకే రాజకీయ అంశాలు తన తండ్రితో చర్చిస్తున్నానని చెప్పారు.
ప్రతి ఒక్కరు కూడా ప్రధాని, ప్రభుత్వం ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలని అభిప్రాయపడ్డారు. తాను కూడా వీటిని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నానని చెప్పారు. సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్ను సిన్హా పాట్నా సాహెబ్ నుండి ఎంపీగా గెలిచారు.

కాగా, తెలుగు సినిమాలు తనకు కొత్త కాదని గతంలో తెలుగు సినిమాల్లో నటించానని సోనాక్షి సిన్హా చెప్పారు. లింగ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సోనాక్షి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాల్లో ఎప్పుడు నటిస్తారని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
తాను ఇది వరకే విక్రమార్కుడు, మర్యాద రామన్న వంటి సినిమాల్లో నటించానని, అయితే అది బాలీవుడ్‌లో నటించానని, ఆ రకంగా తనకు తెలుగు సినిమాలతో మంచి అనుబంధం ఉందని చెప్పారు.
తనకు మంచి అవకాశం వస్తే స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. దక్షిణాదిన సినిమా నటులను అభిమానించే విధానం తనకు చాలా ఇష్టమని సోనాక్షి సిన్హా చెప్పారు. హైదరాబాదు రుచులను ఆస్వాదిస్తానని వెల్లడించింది.












Click it and Unblock the Notifications