తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ- రాష్ట్రపతి ఆమోదం- ఏప్రిల్ 24న బాధ్యతలు
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణను తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పంపిన లేఖకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జస్టిస్ ఎన్వీరమణను తదుపరి సీజేఐగా నియమించాలని కేంద్ర న్యాయశాఖ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీరమణను సీనియారిటీ ప్రకారం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం ఆమోదించింది. ఈ మేరకు ప్రస్తుత ఛీఫ్ జస్టిస్ బాబ్డే కూడా తన వారసుడిగా ఆయన పేరును సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర న్యాయశాఖతో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో జస్టిస్ ఎన్వీరమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 23న జస్టిస్ బాబ్డే సీజేఐగా రిటైర్ కానున్నారు. తర్వాత రోజు జస్టిస్ ఎన్వీరమణ కొత్త సీజేఐగా బాధ్యతలు చేపడతారు.

ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన జస్టిస్ రమణ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. జస్టిస్ కాకర్ల సుబ్బారావు తర్వాత సుప్రీంకోర్టు సీజేఐ వంటి అత్యున్నత పదవి చేపడుతున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ రమణ. ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో మూడు రాజధానుల విభజన ప్రక్రియ కీలక దశలో ఉండటం, దీనికి వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో జస్టిస్ రమణ తీసుకునే నిర్ణయాలపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications