క్రూరమైన నేరాలు: 16-18 ఏళ్ల మధ్య బాలలకు పెద్దవారికి వేసే శిక్షలే....!
న్యూఢిల్లీ: అత్యంత క్రూరమైన నేరాల్లో 16-18 ఏళ్ల మధ్య వయస్కులైన బాల నిందితులకు సాధారణ నిందితులతో సమానంగా పరిగణించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంరక్షణ- బాలల రక్షణ చట్టంలో సవరణలకు అంగీకారం తెలిపింది.
దీని ప్రకారం ఇకపై తీవ్ర నేరాల్లో భాగస్వాములుగా అభియోగాలున్న 16-18 ఏళ్ల బాలలపైనా ఇండియన్ పీనల్ కోడ్ కింద కోర్టులు విచారణ చేపటనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షన బుధవారం మంత్రిమండలిలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

అత్యాచారం, దోపిడీ, హత్య, యాసిడ్ దాడుల వంటి కేసుల్లో బాల నిందితులను సాధారణ నిందితులతో సమానంగా పరిగణించాలని సుప్రీం కోర్టు కూడా సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, నిందిత బాలలను నాధారణ నిందితులతో సమానంగా పరిగణించే అంశాన్ని న్యాయ నిపుణులతో కూడిన కమిటీ పరిశీలన తర్వాత జువెనైల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు.
వీటితో పాటు అనాథలు, వదిలివేసిన, సంరక్షణ కేంద్రాల్లో అప్పగించిన బాలలకు సంబంధించిన అంశాలను, దత్తత ప్రక్రియ క్రమబద్దీకరణను ఈ బిల్లులో చేర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెట్టి చాకిరిపై జాతీయ విధానంలో అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ఐఎల్‌వో) విధానాలను పాటించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications