టీసీఎస్ సీఈఓ రాజీనామా- ఆయన స్థానంలో
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపినాథన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కే కృతివాసన్ నియమితులయ్యారు.
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లో అనూహ్య మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తోన్న రాజేష్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా చేశారు. సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన స్థానాన్ని అప్పటికప్పుడు రీప్లేస్ చేసింది టీసీఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కే కృతివాసన్ ను సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ మార్పులు ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అప్పటివరకు రాజేష్ గోపినాథన్.. టీసీఎస్ సీఈఓగా కొనసాగుతారు. ఆ తరువాతే ఆయన స్థానంలో కే కృతివాసన్ బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రస్తుతం కృతివాసన్ టీసీఎస్ లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ గ్రూప్ విభాగాల అధిపతిగా వ్యవహరిస్తోన్నారు.

1989లో ఆయన టీసీఎస్ లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. 34 సంవత్సరాలుగా ఇందులో కొనసాగుతున్నారు. ప్రారంభంలో ప్రొడక్ట్ డెలివరీ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్, లార్జ్ ప్రోగ్రాం మేనేజ్ మెంట్, సేల్స్ వంటి కీలక విభాగాల్లో పని చేశారు. ఆయా విభాగాలకు లీడ్ గా వ్యవహరించారు. రాజేష్ గోపీనాథన్ ఆరు సంవత్సరాలుగా టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తూ వస్తోన్నారు.

ఆయన సారథ్యంలో గ్లోబల్ టెక్ గా ఎదిగిందీ కంపెనీ. 10 బిలియన్ డాలర్ల నుంచి 70 బిలియన్ డాలర్లకు మేర మార్కెట్ క్యాపిటలైజేషన్ ను నమోదు చేయగలిగింది. ఈ కంపెనీలో 25 ఏళ్ల పాటు పని చేసిన అనుభవం ఉందాయనకు. రాజేష్ గోపినాథ్ సేవలను తాము విస్మరించలేమని టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కితాబిచ్చారు. ఆయనతో కలిసి పని చేయడం సంతృప్తినిచ్చిందని వ్యాఖ్యానించారు. బోర్డు నిర్ణయం ప్రకారం కొత్త సీఈఓగా కృతివాసన్ ను నియమించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications