జామియా ఘటనతో వాళ్ల పతనం మొదలైంది.. నేను రోడ్లెక్కే రకం కాదు: కమల్ హాసన్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వద్దంటూ మంగళవారం కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సీఏఏ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నటుడు, మక్కళ్ నీది మాయ్యుమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో చోటుచేసుకున్న హింసపై సంచలన కామెంట్లు చేశారు.

జామియాలో విద్యార్థులకు తగిలిన ఒక్కో దెబ్బ
జామియాలో విద్యార్థులకు తగిలిన ఒక్కో దెబ్బ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు చెంపదెబ్బ లాంటిందని కమల్ అన్నారు. ‘‘ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఒకప్పుడు మనలాగే రోడ్ల మీదికొచ్చి ఆందోళనలు చేసిన విషయాన్ని విద్యార్థులు మర్చిపోవద్దు. గట్టిగా పోరాడుదాం. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఐసీయూలో ఉంది‘‘ అని కమల్ చెప్పారు.

శ్రీలంక తమిళులు హిందువులేకదా..
పొరుగు దేశాల్లో మత పీడను ఎదుర్కొంటున్నవాళ్ల కోసమే సీఏఏ చేశామని చెబుతున్న కేంద్రం.. శ్రీలంక లోని తమిళ హిందువులను గాలికొదిలేసి, కేవలం పాకిస్తాన్ లోని హిందువులపైనే ప్రేమ చూపడంలోనే కుట్ర దాగుందని కమల్ ఆరోపించారు. సీఏఏను సమర్థిస్తున్న అన్నాడీఎంకే.. బీజేపీకి బానిసలా మారిందని మండిపడ్డారు.

పోరాడటానికి స్టూడెంటే కానక్కర్లేదు..
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఒక్కొక్కరు ఒక్కో తీరుగా పనిచేస్తారని, పోరాడటానికి స్టూడెంట్లే కానక్కర్లేదని కమల్ హాసన్ అన్నారు. స్టూడెంట్లు లాగా తాను రోడ్ల మీదికొచ్చి నిరసన చేయలేనని, కోర్టు ద్వారా పరిష్కారాలు కోరుకుంటానని ఆయన చెప్పారు.

వాళ్ల పతనం మొదలైంది..
‘‘దేశానికి వెన్నెముకలాంటి గ్రామాలు చతికిలపడ్డాయి. రైతులు అరిగోసపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ ఆగమైపోయింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అన్నిరంగాల్లో తన ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోడానికే కేంద్రం.. మతాన్ని అడ్డుపెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్నది. ప్రస్తుత ఘటనలతో దేశవ్యతిరేక శక్తుల పతనం మొదలైనట్లుగా భావించాలి‘‘అని కమల్ హాసన్ అన్నారు.












Click it and Unblock the Notifications