అనూహ్య పరిణామం- రూట్ మార్చిన కణిమోళి
తమిళనాడులో అధికారంలో డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుకుడి లోక్ సభ సభ్యురాలు కనిమొళి కరుణానిధి జాతీయ స్థాయి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా?, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతోన్నారా?, దీనికోసం నియోజకవర్గం కూడా సెలెక్ట్ చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు సైతం చేస్తోన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తూత్తుకుడి జిల్లాలోని తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తోన్నాయి. దక్షిణ తమిళనాడులో డీఎంకే పట్టు సాధించడం, పార్టీ మరింత బలోపేతం కావడానికి ఇది కీలకంగా మారుతుందని అంచనా వేస్తోన్నాయి. ఒకవేళ ఇది ఖరారయితే సుదీర్ఘ విరామం తర్వాత కణిమోళి రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించినట్లవుతుంది.

మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ ప్రస్తుత తిరుచెందూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఆరోగ్య కారణాల వల్ల రాబోయే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఇప్పటికే వెల్లడించారు కూడా. ఇదే విషయాన్ని డీఎంకే అధినాయకత్వానికీ తెలిపారు ఆయన స్థానంలో కనిమొళిని బరిలోకి దింపే యోచనలో ఉంది డీఎంకే. అధికారిక ప్రకటన రానిప్పటికీ- ఇక్కడి నుంచి కనిమొళి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు కావచ్చని చెబుతున్నారు.
మొన్నటికి మొన్న తూత్తుకుడి జిల్లా కార్యవర్గ సమావేశంలో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. అనితా రాధాకృష్ణన్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కణిమోళి సూచించగా.. ఆయన అడ్డుకున్నారు. డీఎంకే తరపున ఎవరు పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలిపించాలని స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అభ్యర్థిత్వ మార్పునకు సంకేతంగా పరిగణిస్తున్నారు. కణిమోళికే టికెట్ దక్కొచ్చని చెబుతున్నారు.
కనిమొళి 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గం నుండి విజయం సాధించారు. అంతకుముందు ఆమె 2007 నుండి 2019 వరకు రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. జాతీయ రాజకీయాలపై ఆమెకు మంచి పట్టు ఉంది. ఆమె సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవాలని డీఎంకే భావిస్తోన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications