ప్రత్యేక పిసిసిలు: సోనియా గాంధీతో కన్నా, ఉత్తమ్ భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ఖాయమైన నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇరు ప్రాంతాలకు వేర్వేరు పిసిసిలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే ఆమె శనివారం సీమాంధ్రకు చెందిన తాజా మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణతో, తెలంగాణకు చెందిన తాజా మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. వారితో సోనియా గాంధీ అర గంట పాటు సమావేశమయ్యారు.
కాపులను బిసి జాబితాలో చేర్చడంపై సోనియా గాంధీ వివరాలు అడిగారని, గణాంకాలతో కూడిన వివరాలను తాను అందించానని కన్నా లక్ష్మీనారాయణ భేటీ అనంతరం మీడియాతో చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీలో సందడి చేస్తున్నారు. వారు జివోఎం సభ్యుడు జైరాం రమేష్‌తో బేటీ కానున్నారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం కన్నా కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తే మంచిదని కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారని, ఆ దిశగా ముందుగానే కాంగ్రెసు అడుగులు వేస్తే బాగుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి సోనియాకు చెప్పినట్లు సమాచారం.
తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ముఖ్యమంత్రిని చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పరోక్షంగా సూచించినట్లు భావిస్తున్నారు. తెలంగాణ నేతలు రాష్ట్రపతి పాలన విధింపునకు వ్యతిరేకంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications