బెంగాల్, బీహార్లో మతఘర్షణలపై మోడీ-షా మౌనం ఎందుకు ? కపిల్ సిబల్ సూటి ప్రశ్న..
శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో పశ్చిమబెంగాల్, బీహార్ లో తాజాగా చోటు చేసుకున్న ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని పూర్తి స్ధాయిలో నియంత్రించడంలో అక్కడి ప్రభుత్వాలు విఫలవుతున్నాయి. దీనిపై కేంద్రం కూడా మౌనం వహిస్తోందని ఇవాళ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ, అమిత్ షాపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.
పశ్చిమ బెంగాల్, బీహార్‌లో మత ఘర్షణలపై ప్రధాని మోడీ మౌనంగా ఉండిపోవడాన్ని ఎంపీ కపిల్ సిబల్ ఆక్షేపించారు. ఈ ఘర్షణలు 2024 సార్వత్రిక ఎన్నికలకు కారణం కాకూడదన్నారు. హింస, దహనాలు, విద్వేష బీజాలు, రాజకీయ నాయకులకు, రాజకీయ సిద్ధాంతాలకు మాత్రమే మేలు చేకూరుస్తాయని కపిల్ సిబల్ దేశ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ద్వేషానికి సామాన్యుడు బలి అవుతాడన్నారు.

రెండు రాష్ట్రాల్లో హింసపై ఇప్పటికైనా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాట్లాడాలని, హింసను అరికట్టాలని కపిల్ సిబల్ కోరారు. ఈ హింసపై వారిద్దరూ మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. వారిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దేశంలో చట్టబద్ధమైన పాలన సాగనివ్వాలని కోరారు. బీహార్‌లో మత ఘర్షణల ఘటనలపై హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారని, పరిస్థితిని సమీక్షించేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో మాట్లాడారని
కానీ, దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదని కపిల్ సిబల్ అన్నారు.
రామనవమి ఉత్సవాల సందర్భంగా బీహార్లోని ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మతపరమైన హింస చెలరేగింది. ససారం, బీహార్ షరీఫ్‌లలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి పోలీసులు శనివారం వరకు 45 మందిని అరెస్టు చేశారు. రెండు పట్టణాలలో జరిగన ఘర్షణల్లో వాహనాలు, ఇళ్ళు, దుకాణాలు తగలబడ్డాయి, అనేక మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని శిబ్‌పూర్ మరియు కాజీపరా ప్రాంతంలో కూడా రామనవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications