బెంగళూరు సిటీలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఆధిక్యతలో ఉందంటే..?
బెంగళూరు: అత్యంత ఉత్కంఠత రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ స్పష్టత ఏర్పడుతోంది. ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడినప్పటికీ- ఆ తరువాత బీజేపీ వెనుకంజ వేసింది. జనతాదళ్ (సెక్యులర్) ఫర్వాలేదనిపించుకుంటోంది.
ప్రారంభ ఫలితాల్లో ఏ పార్టీకి కూడా ఆధిక్యత లభించేలా కనిపించట్లేదు. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 111 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీజేపీ అభ్యర్థులు 78 నియోజకవర్గాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. జేడీఎస్ 28, ఇతరులు ఏడు చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- షిగ్గావ్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య-వరుణ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్-కనకపురల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. టికెట్ దక్కకపోవడం వల్ల చివరి నిమిషంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ హుబ్లీ-ధర్వాడలో వెనుకంజలో ఉన్నారు. బీజేపీకే చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్షణ సవాది- అథణి నియోజకవర్గంలో లీడింగ్‌లో ఉన్నారు.
చిక్‌బళ్లాపురాలో వైద్యారోగ్య శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ కే సుధాకర్ వెనుకంజలో ఉన్నారు. మల్లేశ్వరం అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వర్థనారాయణ ఆధిక్యతలో ఉన్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 113. ప్రారంభ ఫలితాల్లో ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకునేలా కనిపించట్లేదు.
బెంగళూరు నగరం పరిధిలోని మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతోన్నారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలో మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకునేలా కనిపిస్తోంది. శివాజీనగర- రిజ్వాన్ అర్షద్, బ్యాటరాయనపుర- కృష్ణబైరె గౌడ, బసవనగుడి- యూబీ వెంకటేష్, బీటీఎం లేఅవుట్- రామలింగారెడ్డి ఆధిక్యతలో ఉన్నారు.

అలాగే.. సర్వజ్ఞనగర్- కేజే జార్జ్, చామరాజపేటె- జమీర్ అహ్మద్ ఖాన్, పులకేశినగర- ఏసీ శ్రీనివాస్, హెబ్బాళ- సురేష్ బీఎస్, గాంధీనగర్- దినేష్ గుండూరావు, దాసరహళ్లి- జీ ధనంజయ, ఆధిక్యతలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు.. బొమ్మనహళ్లి- ఉమాపతి శ్రీనివాస్, బెంగళూరు సౌత్- ఎం కృష్ణప్ప, శాంతినగర- శివకుమార్, రాజాజీనగర- ఎస్ సురేష్ కుమార్, సీవీ రామన్ నగర్- ఎస్ రఘు, విజయనగర- హెచ్ రవీంద్ర, మల్లేశ్వరం- డాక్టర్ అశ్వర్థనారాయణ, మహాలక్ష్మి లేఅవుట్- కే గోపాలయ్య, రాజరాజేశ్వరినగర- మునిరత్న ఆధిక్యతలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications