ఆమె గేటు వద్ద ఉండే కుక్కలానే.. ఐపీఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు !
కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఓ మహిళా ఐపీఎస్ అధికారిని పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఎస్పీని కాంగ్రెస్ నేతల ఇంట్లో 'పెంపుడు కుక్క'లా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్స్ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్వయంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దావణగెరెలో రిపోర్టర్స్ గిల్డ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో హరిహర బీజేపీ ఎమ్మెల్యే బి.పి.హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తానొక ఎమ్మెల్యేని అని.. కానీ ఎస్పీ ఉమా ప్రశాంత్ మాత్రం ఏదైనా కార్యక్రమంలో తనను చూస్తే ముఖం చిట్లించుకుంటున్నారు. అదే కాంగ్రెస్‌కు చెందిన శమనూరు కుటుంబ సభ్యుల కోసం మాత్రం గేటు వద్ద పడిగాపులు కాస్తున్నారు. అచ్చం వాళ్లింట్లోని పోమరేనియన్ కుక్కలా ఆమె ప్రవర్తన ఉంటోందని విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శమనూరు శివశంకరప్ప ఎమ్మెల్యేగా.. ఆయన కుమారుడు ఎస్.ఎస్. మల్లికార్జున్ రాష్ట్ర మంత్రిగా, కోడలు ప్రభా మల్లికార్జున్ దావణగెరె ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అందుకే ఎస్పీ వారిపట్ల ప్రత్యేక గౌరవం చూపుతున్నారని ఆరోపించారు. తాను ప్రజాప్రతినిధినే.. వారు కూడా ప్రజాప్రతినిధులే అని.. కానీ ఈ వివక్ష ఎందుకు ? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారి అండ తాత్కాలికమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఎస్పీ ఉమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు దావణగెరెలోని కేటీజే నగర్ పోలీస్ స్టేషన్‌లో హరీశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజా ప్రతినిధిగా గౌరవ పదవిలో ఉన్న వ్యక్తి ఈ తరహా పదజాలాన్ని ఉపయోగించడం సరైన పద్దతి కాదని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications