సిట్ ముందుకు వస్తా, ఫ్యామిలీకి రక్షణ కల్పించండి: సీడీ కేసులో మహిళ మరో వీడియో
న్యూఢిల్లీ: కర్ణాటక సీడీ స్కాండల్ కేసు మలుపులు తిరుగుతోంది. సదరు సీడీ మహిళ సిట్ దర్యాప్తును ప్రశ్నిస్తూ ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది. కేసు దర్యాప్తును సమగ్రంగా, సరైన దారిలో కొనసాగించాలని కోరింది. సిట్ దర్యాప్తుపై అనుమానం కలుగుతోందని తెలిపింది. అంతేగాక, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విన్నవించింది.
తన కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించిన అనంతరం తాను సిట్ ముందు హాజరై తన వాదనను వినిపిస్తానని సదరు మహిళ తెలిపింది. నిమిషానికిపైగా నిడివి ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'నా తల్లిదండ్రులు తమ సొంతంగా ఫిర్యాదు చేయలేదని నమ్ముతన్నా. వారికి తమ కూతురు ఎలాంటి తప్పు చేయదని తెలుసు. నా తల్లిదండ్రుల క్షేమం నాకు ముఖ్యం. ఒకసారి వారు క్షేమంగా ఉన్నారని తెలిసిన తర్వాత, నేను సిట్ ముందు హాజరై, నా వాంగ్మూలాన్ని వినిపిస్తా' అని ఆ మహిళ తెలిపింది.
'నా తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని సిద్ధారామయ్య, డీకే శివకుమార్‌లను కోరుతున్నా. న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. మార్చి 12న ఓ వీడియో చేసి కమిషనర్ కార్యాలయాలకు, సిట్‌కు పంపించా. 30 నిమిషాల తర్వాత నా వీడియో విడుదలైంది. సిట్ ఎలా పనిచేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు' అని మహిళ పేర్కొంది.
కాగా, ఇంతకుముందు వీడియోలో తనకు రక్షణ కల్పించాలని కర్ణాటక హోంమంత్రిని కోరింది. సదరు మహిళ ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని హోంమంత్రి బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో పేర్కొన్నారు.
ఇది ఇలావుంగా, కర్ణాటక వైద్యారోగ్య మంత్రి కేశవ సుధాకర్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 255 మంది ఎమ్మెల్యేల అనైతిక వ్యక్తిగత సంబంధాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వారి వివాహేతర సంబంధాల గురించి తెలిస్తేనే వారి అసలు రూపం బయటపడుతుందని అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాసలీల కేసులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి తన మంత్రి పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే.