మందుబాబులకు పండగ: బార్ అండ్ రెస్టారెంట్ల కొత్త టైమింగ్స్ ఇవే
Liquor: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి మద్యంపై ఆధారపడింది. మద్యంబాబులకు తీపికబురు ఇచ్చింది. బెంగళూరులో మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం అందుబాటులో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది.
రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి గతంలో రాష్ట్రవ్యాప్తంగా బీర్ల అమ్మకాలపై వసూలు చేస్తోన్న ఎక్సైజ్ ట్యాక్స్‌ను కర్ణాటక ప్రభుత్వం అదనంగా 10 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అప్పట్లో బడ్జెట్‌లో సైతం చేర్చింది సిద్ధరామయ్య సర్కార్. దీనివల్ల సంవత్సరానికి ఖజానాకు అదనంగా 1,200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది.

మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం భారీగా ఉంటోంది కర్ణాటకలో. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2022-2023 ఆర్థిక సంవత్సరంలో బీర్ల అమ్మకాల ద్వారా మాత్రమే 800 కోట్ల రూపాయల ఆదాయాన్ని చవి చూసింది. ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికీ 390.66 లక్షల కార్టన్ బాక్సుల మేర బీర్లు అమ్ముడయ్యాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంఖ్య రెట్టింపు. ఆ సంవత్సరంలో 268.83 లక్షల కార్టన్ బాక్సుల మేర బీర్లు అమ్మకాలు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా బీర్ల అమ్మకాలపై ఎక్సైజ్ ట్యాక్స్‌ను 10 శాతం పెంచడం వల్ల వార్షిక ఆదాయం 1,200 కోట్ల రూపాయలకు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఆదాయాన్ని మరింత పెంచుకునేలా చర్యలు తీసుకుంది. మద్యం అమ్మకాల సమయాన్ని సవరించింది. బెంగళూరులో ఇకపై అర్ధరాత్రి ఒంటిగంట వరకు బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచే ఉంటాయి. పబ్బులు, క్లబ్బులు, స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం సర్వ్ చేయడానికి అనుమతులు ఇచ్చింది.
సీఎల్ 4 (లైసెన్స్ టు క్లబ్స్), సీఎల్- 6 (ఏ) స్టార్ హోటల్, సీఎల్- 7 హోటళ్లు, బోర్డింగ్ హౌస్‌లు, సీఎల్ 7డీ- ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన హోటళ్లు, బోర్డింగ్ హౌస్‌లు, సీఎల్- 9 రిఫ్రెష్‌మెంట్ రూమ్ (బార్లు)లకు ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం సర్వ్ చేసే వీలును కల్పించింది.












Click it and Unblock the Notifications