నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల కర్ణాటక ప్రభుత్వం సంతాపాన్ని తెలిపింది. ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలకు సెలవును ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ తీవ్ర ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని ఒంటిచేత్తో ఒడ్డెక్కించారు.

గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరిగా, రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందారు. మానవీయ కోణంలో సంస్కరణలను చేపట్టిన ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన తీవ్ర మాంద్యం పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరలేదంటే దాని ప్రధాన కారణం మన్మోహన్ సింగ్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. అత్యంత సంక్షోభ సమయంలోనూ దేశాన్ని ముందుండి నడిపించిన అధినాయకుడిగా అభివర్ణించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తరహాలో ముందుచూపుతో వ్యవహరించారని పేర్కొన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలను అమలు చేశారని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అన్నారు. ఆధునిక భారత్‌కు అత్యంత బలమైన పునాదులు వేశారని చెప్పారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఎలాంటి ఉత్సవాలు, వేడుకలను నిర్వహించకూడదని అన్నారు,












Click it and Unblock the Notifications