పక్క రాష్ట్రంలో దేవాలయాలన్నీ రీఓపెన్: సేవల్లేవ్..దర్శనాలకు మాత్రమే
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వల్ల దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. సెకెండ్ వేవ్ ఆరంభమైన తొలి రోజుల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. ఒక్కరోజులో గరిష్ఠంగా 40 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు రికార్డయిన సందర్భాలు ఉన్నాయి. మరణాల్లోనూ అదే తీవ్రత కనిపించింది. దేశంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన మెట్రో సిటీల్లో బెంగళూరులో టాప్‌లో కొనసాగింది. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేసింది. రెండునెలలు కర్ణాటక లాక్‌డౌన్‌లో కొనసాగింది.
లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇవ్వడంతో ఇప్పుడకక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజువారీ కేసుల సంఖ్య అయిదు వేలకు దిగువకు పడిపోయింది. దానికి అనుగుణంగా మరణాలూ గణనీయంగా తగ్గాయి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది యడియూరప్ప సర్కార్. దశలవారీగా దాన్ని అమలు చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా- ఇక కొత్తగా దేవస్థానాలను పునరుద్ధరించింది. వాటిని తెరవడానికి అనుమతి ఇచ్చింది.

ఈ తెల్లవారు జాము నుంచి కర్ణాటక వ్యాప్తంగా అన్ని దేవాలయాలు తెరచుకున్నాయి. పూజలు ప్రారంభం అయ్యాయి. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా మందిరాలన్నీ రీఓపెన్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో ఆయా ప్రార్థనా మందిరాల్లో రోజువారీ పూజలు, ప్రార్థనలు యధాతథంగా కొనసాగినప్పటికీ- భక్తులకు అనుమతి ఇవ్వలేదు. తాజాగా ఈ ఆంక్షలను కర్ణాటక ప్రభుత్వం సడలించింది. ఈ తెల్లవారు జాము నుంచి భక్తులకు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి దర్శనాలకు మాత్రమే. ఆర్జిత సేవలు గానీ.. ఇతర ప్రత్యేక పూజలకు గానీ ఇది వర్తించదు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరపరిచితమైన ధర్మస్థల శ్రీమంజునాథుని పుణ్యక్షేత్రం ఆలయ తెరచుకుంది. ఈ తెల్లవారు జామును సంప్రదాయబద్ధంగా పూజాదికాలను చేపట్టారు అర్చకులు. భక్తులకు అనుమతి ఇస్తోన్నారు. శృంగేరి శారదాపీఠంలో పూజలు ఆరంభం అయ్యాయి. కుక్కే సుబ్రహ్మణ్య పుణ్యక్షేత్రంలో భక్తుల రాకపోకలు మొదలయ్యాయి. కలబురగిలోని ప్రఖ్యాత శరణ బసవేశ్వర ఆలయం తలుపులు ఈ తెల్లవారు జామున తెరచుకున్నాయి. ఆలయ వార్షిక ఉత్సవాలు గానీ, జాతరలను గానీ నిర్వహించడానికి ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా జిల్లా పాలనా యంత్రాంగం దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications