karnataka polls : బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోపై సిద్ధరామయ్య రియాక్షన్ ఇదే..
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరో 9 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 10న జరిగే పోలింగ్ కోసం అన్ని పార్టీలు హోరాహోరీగా సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ ఇవాళ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దు, ఎన్సార్సీ అమలు వంటి వివాదాస్పద అంశాలతో పాటు పలు సంక్షేమ పథకాలను కూడా ఇందులో పొందుపర్చింది. అయితే దీనిపై విపక్ష కాంగ్రెస్ నేత, సీఎం అభ్యర్ధిగా భావిస్తున్న సిద్ధరామయ్య స్పందించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి ఇవాళ విడుదల చేసిన మేనిఫెస్టోను "బోగస్" అని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అభివర్ణించారు. కాషాయ పార్టీ గత ఎన్నికల సమయంలో చేసిన ఎన్నికల వాగ్దానాలలో ఏవీ అమలుచేయలేదన్నారు. గడగ్‌లో మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య.. రేపు తాము మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని, బీజేపీ మేనిఫెస్టో బోగస్ అని తెలిపారు.తాము కేవలం అమలు చేసే మేనిఫెస్టో విడుదల చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌కు బీజేపీకి ఉన్న తేడా అదే అన్నారు.

2018లో బీజేపీ 600 వాగ్దానాలు చేసి 55 మాత్రమే అమలు చేసిందని సిద్ధరామయ్య ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం 165 హామీలు ఇచ్చిందని, 158 నెరవేర్చామని, అదే ఇద్దరీ మధ్య తేడా అన్నారు. అంతకుముందు బెంగళూరులో కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో 'బిజెపి ప్రజా ప్రాణాలికే'ని కాషాయ నేతలు విడుదల చేశారు. కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి, ఎన్నార్సీ అమలు వంటి కీలక వాగ్దానాలు ఇందులో ఉన్నాయి.
దీంతో బీజేపీ విడుదల చేసిన వివాదాస్పద వాగ్దానాలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రేపు తన మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఇందులో వీటికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ ఏయే హామీలు ఇవ్వబోతోందనే దానిపై ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని పలు సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో మ్యానిఫెస్టో ప్రభావం ఎంత అనేది రేపు తేలిపోతుంది.












Click it and Unblock the Notifications