మార్చి 22న కర్ణాటక బంద్.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉందా..?
మార్చి 22న కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కన్నడ ఓకూట ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగనుంది. బెళగావిలో KSRTC బస్సు కండక్టర్ పై దాడిని నిరసిస్తూ కన్నడ అనుకూల సంఘాలు ఈ నెల 22న 12 గంటల రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి.
బంద్ పై బెంగళూరు డిప్యూటీ కమిషనర్ జగదీష. జీ మాట్లాడారు. మార్చి 22 శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉన్నా స్కూళ్లు, కాలేజీలకు మాత్రం ఎలాంటి బంద్ లేదని.. అవి యథాతథంగా తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.
కర్ణాటక బంద్ ఎందుకు..?
కర్ణాటక బంద్ కు గల కారణం ఏంటంటే.. గత నెలలో బెళగావిలో మరాఠీలో మాట్లాడలేదనే కారణంతో KSRTC బస్సు కండక్టర్ పై మరాఠీ అనుకూల గ్రూపులు దాడి చేశారు. ఈ ఘటనకు నిరసనగా కన్నడ అనుకూల సంఘాలు సంయుక్తంగా ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. అంతేకాక పెంచిన బెంగళూరు మెట్రో ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, గ్రేటర్ బెంగళూరు అథారిటీ బిల్లును వెనక్కు తీసుకోవాలని కన్నడ అనుకూల సంఘాలు డిమాండ్ చేశాయి.

అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బంద్ కు మద్దతు ప్రకటించలేదు. కర్ణాటక ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ అసోసియేషన్(KAMS)కూడా బంద్ ను నిరసిస్తూ వస్తోంది. బంద్ వల్ల ఎగ్జామినేషన్ షెడ్యూల్ దెబ్బతింటుందని పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఇప్పటికే టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరోవైపు సీబీఎస్సీ, ఐఎస్ఈ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
మరోవైపు బంద్ కు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. అంతేకాక ఓలా, ఉబెర్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్, ఇతర ఆటో రిక్షా యూనియన్ల నుంచి కూడా బంద్ కు మద్దతు లభించింది.












Click it and Unblock the Notifications