వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక: టిప్పు సుల్తాన్ కట్టించిన జామియా మసీదు ఒకప్పుడు హనుమాన్ మందిరమా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కర్నాటక శ్రీరంగపట్నంలోని టిప్పు సుల్తాన్ కట్టించిన జామియా మసీదు లోపల ఉన్నట్లుగా చెబుతున్న మందిరానికి విముక్తి కల్పించాలంటూ కొన్ని హిందూ సంస్థలు పిలుపునిస్తున్నాయి.

హిందూ మందిరం శిథిలాలపై టిప్పు సుల్తాన్ ఈ మసీదును కట్టినట్లు ఆ హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

హిందూ సంస్థల పిలుపు నడుమ జిల్లా పరిపాలనా విభాగం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఆ మసీదు పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా భారీగా పోలీసులను మోహరించారు.

జామియా మసీదు చరిత్రను పరిశీలిస్తే, ఇది వారణాసిలోని జ్ఞాన్‌వాపి, మంగళూరులోని మలాలీ మసీదు (ఇక్కడ ఆలయ నిర్మాణం కూడా కనిపిస్తుంది) కంటే భిన్నమైనదని తెలుస్తుంది.

అలా మొదలైంది..

ఈ మసీదుకు రెండు కిలో మీటర్ల దూరంలోని బెంగళూరు-మైసూరు ప్రధాన రహదారిపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), నరేంద్ర మోదీ విచార్ మంచ్ (ఎన్ఎంవీఎం), బజరంగ్ దళ్‌లకు చెందిన వందల మంది కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.

Tippu Sultan Jamia Masjid

దీంతో మసీదు చుట్టుపక్కల ప్రాంతాల్లో 500 మంది భద్రత సిబ్బందిని మోహరించారు.

కాషాయ కండువాలు కప్పుకుని ''జై హనుమాన్’’, ''జైశ్రీ రామ్’’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. అయితే, అందరూ శాంతించాలని మండ్యా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అభ్యర్థించారు. మరోవైపు నిరసనకారులతో భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ)కి చెందిన ఓ అధికారి కూడా మాట్లాడారు.

''ఇక్కడ మొదట ఆలయం ఉండేదా? అని సర్వే చేపట్టేందుకు ఒక మెమొరాండాం దిల్లీలోని డైరెక్టరేట్‌కు పంపించాం. ఆ అభ్యర్థనను ఇంగ్లీష్‌లోకి అనువదించి అక్కడకు పంపించాం’’అని ఆ ఏఎస్ఐ అధికారి చెప్పారు.

మరోవైపు ఈ అంశంపై నరేంద్ర మోదీ విచార్ మంచ్ (ఎన్ఎంవీఎం) కోఆర్డినేటర్ సీటీ మంజునాథ్ బీబీసీతో మాట్లాడారు.

''ఈ మసీదు ఒకప్పుడు దేవాలయమని చెప్పేందుకు మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. ఆలయ స్తంభాలు, కలశం, గణేశ విగ్రహం, పుష్కరిణి, చక్రం (విష్ణు దేవాలయాల్లో కనిపించే చక్రం) మసీదులో ఇప్పటికీ అలానే ఉన్నాయి. అది మసీదు కాదు.. దేవాలయమే. జ్ఞాన్‌వాపీ మసీదులో చేపట్టినట్టే ఇక్కడ కూడా సర్వే చేయాలి’’అని మంజునాథ్ అన్నారు.

''ఒకసారి సర్వే పూర్తయితే, అది దేవాలయం అని తెలుస్తుంది. అప్పుడు దాన్ని మాకు అప్పగించండి. అక్కడ ఆంజనేయస్వామి దేవాలయం ఉందని మాకు పక్కాగా తెలుసు’’అని మంజునాథ్ అన్నారు.

అయోధ్యలోని బాబ్రీ మసీదు, వారణాసిలోని జ్ఞాన్‌వాపీ మసీదు తరహాలో కర్నాటకలో ఇలా వివాదాల్లో చిక్కుకున్న రెండో మసీదు ఇది. ఇదివరకు మంగళూరులోని మలాలీ మసీదును పునరుద్ధరించేందుకు తవ్వకాలు జరిపినప్పుడు, అక్కడ దేవాలయం తరహా నిర్మాణం ఒకటి బయటపడింది.

వెంటనే మలాలీ మసీదు చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ వివాదం స్థానిక కోర్టు పరిధిలో ఉంది. అయితే జామియా మసీదు విషయంలోనూ ఇలానే కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు మంజునాథ్ తెలిపారు. మరోవైపు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్-1991ను దీనికి అమలు చేయకూడదని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఆ చట్టాన్ని బాబ్రీ మసీదు వివాద సమయంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చింది. 1947కు ముందు ప్రార్థనా స్థలాల్లో ఏ మతాన్ని అనుసరిస్తున్నారో ఆ తర్వాత కూడా అదే మతాన్ని అనుసరించాలని ఆ చట్టం చెబుతోంది.

ప్రతి మసీదులోనూ శివ లింగాన్ని వెతకాల్సిన అవసరంలేదని ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధిపతి మోహన్ భాగవత్ చెప్పారు. దీనిపై మంజునాథ్‌ను ప్రశ్నించినప్పుడు.. ''ఆరెస్సెస్ చాలా శక్తిమంతమైన సంస్థ. చాలా మంచి పనులు కూడా చేస్తుంది. అయితే, ఆ వ్యాఖ్యల్లో స్పష్టతలేదు’’అని ఆయన సమాధానం ఇచ్చారు.

ఆధారాలు ఏం చెబుతున్నాయి?

''ఒకప్పుడు ఇక్కడ దేవాలయం ఉండేదని 1935నాటి ఏఎస్ఐ సర్వే రిపోర్టు చెబుతోంది. తారీఖ్-ఎ-టిప్పు, మలబార్ మాన్యువల్స్ లాంటి పుస్తకాల్లోనూ ఇక్కడ ఆంజనేయస్వామి దేవాలయం ఉందని పేర్కొన్నారు’’అని మంజునాథ్ చెప్పారు.

ఇక్కడ మసీదును ఎలా ఎలా నిర్మించారో చరిత్రకారుడు మిర్ హుస్సేన్ అలీ కిరమానీ తన పుస్తకం ''హిస్టరీ ఆఫ్ టిప్పు బీయింగ్ ఏ కంటిన్యుయేషన్ ఆఫ్ ద నిశాన్ ఏ హైదరీ’’లో వివరించారు. ఇరాన్ మూలాలున్న కిరమానీ.. టిప్పు ఆస్థానంలో 1781 నుంచి 1786 వరకు పనిచేశారు. ఆ పుస్తకం పర్షియన్‌లో రాశారు. అయితే, దాన్ని కల్నల్ డబ్ల్యూ మైల్స్ ఇంగ్లీష్‌లోకి అనువదించారు.

''దేవరాయ పీఠానికి సమీపంలో టిప్పు సుల్తాన్ చిన్నప్పుడు పిల్లలతో ఎక్కువగా ఆడుకునేవాడు. తన మిత్రుల్లో కొందరు బ్రాహ్మణులు కూడా ఉండేవారు. ఒకరోజు వారంతా అక్కడ ఆడుకునేటప్పుడు ఒక ఫకీర్ అక్కడకు వచ్చాడు. ఈ ప్రాంతానికి నువ్వు పెద్దయ్యాక రాజువు అవుతావని ఫకీర్ చెప్పాడు. నువ్వు సుల్తాన్ అయ్యాక, ఇక్కడున్న దేవాలయాన్ని కూలదోసి ఒక మసీదును కట్టాలని సూచించారు’’అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

''ఆ ఫకీర్ మాటలకు టిప్పు నవ్వి.. తాను రాజైతే తప్పకుండా అలా చేస్తానని సమాధానం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత టిప్పు తండ్రి రాజు అయ్యారు. వారికి చాలా డబ్బు, భూములు కూడా వచ్చాయి. దీంతో ఆ ఫకీర్‌కు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. ఈ దేవాలయం పరిసరాల్లోని భూమిని ఆయన కొనుగోలు చేశారు. అప్పటికి అక్కడ నంది తరహా విగ్రహం, గోడలు మాత్రమే ఉండేవి. లోపలి విగ్రహాన్ని బ్రాహ్మణులు దేవరాయ పీఠానికి తీసుకెళ్లారు. దీంతో ఇక్కడ దేవాలయాన్ని కూలదోసి మసీదును కట్టారు. బీజాపూర్‌లో ఆదిల్ షా కట్టిన మసీదు తరహాలోనే ఇక్కడ మసీదు కట్టారు’’అని ఆ పుస్తకంలో వివరించారు.

ఆ పుస్తకంలో ప్రస్తావించిన నంది విగ్రహం.. సాధారణంగా శివాలయాల్లో కనిపిస్తుంది.

టిప్పు కాలంపై లోతుగా పరిశోధన చేపట్టిన నిథిన్ ఓలీకారా ఈ మసీదు నిర్మాణంపై మాట్లాడుతూ.. ''ఆ మసీదు కట్టడానికి రెండేళ్లు పట్టింది. దీని కోసం రూ.3 లక్షలు ఖర్చుచేశారు’’అని ఆయన చెప్పారు.

''శ్రీరంగపట్నంలోని ప్రధానమైన మసీదుల్లో ఇది కూడా ఒకటి. దీన్ని మసీద్-ఎ-ఆలా లేదా శాహీ మసీదని పిలిచేవారు. టిప్పు పాలనా కాలంలో ఇది ప్రధానమైన జామియా మసీదు’’అని నిథిన్ వివరించారు.

''మసీదు లోపల స్తంభాలతో ఒక వరండా ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే దానిపై హిందూ దేవతల విగ్రహాలు చెక్కినట్లు కనిపిస్తాయి. ఒకప్పుడు ఇక్కడ ఉండే ఆలయంలో ఇది భాగమై ఉండొచ్చు’’అని ఆయన చెప్పారు.

ఘర్షణల ముప్పు

ఈ అంశంపై మైసూర్ యూనివర్సిటీలోని టిప్పు సుల్తాన్ స్టడీస్ విభాగం ఛైర్మన్, ప్రొఫెసర్ సెబాస్టియన్ జోసెఫ్ కూడా మాట్లాడారు. ఇక్కడ ముందు దేవాలయం ఉండేదనే వాదనను ఆయన కూడా సమర్థించారు.

''శ్రీరంగపట్నం కోట పరిసరాల్లో ఈ మసీదును పూర్ణయ్య దివానుగా ఉండేటప్పుడు నిర్మించారు. పూర్ణయ్య అనుమతి లేకుండా ఇక్కడ ఒకక రాయి కూడా కదిల్చేవారు కాదు. ఆలయాన్ని కూలదోసే బాధ్యతలను ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు’’అని జోసెఫ్ వివరించారు.

''మీరు శ్రీరంగపట్నం కోటను జాగ్రత్తగా పరిశీలిస్తే కలస్థావాడా జైన ఆలయాల శిథిలాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయాలను ఆ కాలానికి చెందిన దండనాయక కూలదోయించారు. మొత్తంగా ఆ కాలంలో వంద జైన ఆలయాలను ఆయన కూలదోసినట్లు కొన్ని శిలా శాసనాలు చెబుతున్నాయి’’అని జోసెఫ్ వివరించారు.

''మైసూర్‌లోని హనుమాన్ ఆలయాలను దండనాయక కాలంలోనే ఎక్కువగా నిర్మించారు. విజయనగర మహారాజు.. విధేయతకు హనుమాన్ ప్రతీకగా భావించేవారు’’అని ఆయన చెప్పారు.

''మైసూర్‌లో ఒడయార్‌లు స్వతంత్ర పాలకులుగా అవతరించినప్పుడు.. ఈ హనుమాన్ దేవాలయాలు తమ ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. ఆ తర్వాత చాముండేశ్వరీ ఆలయాలను ఎక్కువగా నిర్మించడం మొదలుపెట్టారు. అధికారం చేతులు మారినప్పుడు ఆలయాలు కూడా ప్రాధాన్యం కోల్పోయేవి’’అని ఆయన తెలిపారు.

''భారత్‌లో చరిత్రను పరిశీలిస్తే మతాన్ని రాజకీయ కారణాల కోసం ఉపయోగించుకున్నట్లు స్పష్టం అవుతుంది. శివ-జైన, శివ-వైష్ణవ, బౌద్ధ-వైష్ణవ లాంటి వర్గాల మధ్య ఘర్షణలు ఇలా వచ్చినవే. అందుకే మనం చరిత్రను తవ్వుకోకూడదు’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Karnataka:Was jamia Masjid that was built by Tippu Sultan once a Hanuman Mandir
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X