వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక: క్లాస్‌రూంలోనూ బురఖా ధరిస్తామని ఈ అమ్మాయిలు ఎందుకు పట్టుబడుతున్నారు, ప్రిన్సిపల్ ఎందుకు వద్దంటున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

క్లాస్‌రూంలోనూ తమను హిజాబ్(బురఖా) ధరించనివ్వాల్సిందేనని కర్ణాటకలోని ఉడిపి పట్టణంలో ఉన్న ఓ ప్రీ యూనివర్సిటీ కాలేజ్ విద్యార్థినులు కొందరు పట్టుపడుతున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయమవుతోంది.

బురఖాను క్యాంపస్‌లో ధరించవచ్చని, క్లాసులో ధరించవద్దని అధికారులు ఇచ్చిన ఆదేశాలను ఈ పన్నెండో తరగతి విద్యార్థినులు వ్యతిరేకిస్తున్నారు.

Hijab

''ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ వాదననే విన్నారు. మా అభిప్రాయం తీసుకోలేదు. వారు మా మాటలను కూడా విని ఉండాల్సింది’’ అని విద్యాశాఖ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న విద్యార్ధినులు విలేఖరులతో అన్నారు.

హిజాబ్ ధరించడం తమ హక్కు అంటున్న ఆరుగురు విద్యార్థినులలో ఐదుగురు ప్లకార్డులు పట్టుకుని స్కూల్ ఎదుట నిరసన తెలిపారు.

అయితే, పాఠశాల యాజమాన్యం మాత్రం ఇది గర్ల్స్ హైస్కూల్ అని, ఇక్కడ బురఖా ధరించాల్సిన అవసరం లేదని, అది కూడా క్లాసులో ఉన్నప్పుడు మాత్రమే ధరించవద్దని చెబుతున్నామని అంటోంది.

''మా స్కూల్లో ఐదారుగురు మగ లెక్చరర్లు ఉన్నారు. వారి ముందు మేం బురఖా ధరించాల్సిందే’’ అని అల్మాస్ అనే సైన్సు విద్యార్ధిని అన్నారు. ఈ లెక్చరర్లు ఇంగ్లిష్, హిందీ బోధిస్తారని వారు బీబీసీకి తెలిపారు.

కర్ణాటక తీర ప్రాంతాలలో విద్యాసంస్థల్లో బురఖా ధరించడంపై గత రెండేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని హిందూత్వ ప్రయోగశాలగా చెబుతుంటారు.

హిజాబ్‌కు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలోని కొప్ప, మంగళూరుల్లోని కాలేజీల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి.

చిక్కమగళూరులోని ఓ కాలేజీలో వివాదం చెలరేగడంతో విద్యార్ధులు కాషాయ దుస్తులు, బురఖాలు ధరించరాదని ఆ కాలేజీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిలు స్కార్ఫ్‌ ధరించరాదని కూడా స్పష్టం చేసింది.

ఉడిపి కాలేజీ వివాదం

''మా కాలేజీలో దాదాపు 1,000 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరిలో 75 మంది ముస్లింలు. ఈ ఆరుగురు విద్యార్థులు మినహా మిగిలిన మెజారిటీ ముస్లిం బాలికలకు మా నిబంధనలతో ఎలాంటి సమస్యా లేదు’’ అని కళాశాల ప్రిన్సిపాల్ రుద్రెగౌడ బీబీసీతో అన్నారు.

''విద్యార్ధినులు హిజాబ్ ధరించి క్యాంపస్‌లో తిరగడానికి అనుమతించాం. వాళ్లు క్లాసులో మాత్రమే హిజాబ్ ధరించరాదని నిబంధన పెట్టాం. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎదుట జరిగిన సమావేశంలోనూ ఇదే విషయం చెప్పాం’’ అని రుద్రెగౌడ గుర్తు చేశారు.

విద్యార్ధులంతా సమానంగా కనిపించాలన్న ఉద్దేశంతో మిగతా కాలేజీల్లాగానే తాము కూడా యూనిఫాం నిబంధన పెట్టామని గౌడ తెలిపారు.

''ధనిక విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలకు వెళతారు. మిగిలిన వారు మా కాలేజీకి వస్తారు. వారు ఎక్కువగా ఉత్తర కర్ణాటక జిల్లాల నుండి వలస వచ్చినవారి పిల్లలు’’ అన్నారాయన.

''రెండు వారాల కిందట దాదాపు డజను మంది విద్యార్థులు వచ్చి క్లాస్‌లో కూడా హిజాబ్ ధరించడానికి అనుమతించాలని పట్టుబట్టారు. ఈ సమస్య ఎందుకు వస్తుందో మాకు అర్థం కాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాను. కాలేజీ తీరుపై తల్లిదండ్రులెవరూ అభ్యంతరం చెప్పలేదు. అలా డిమాండ్ చేసిన విద్యార్ధినుల సంఖ్య నాలుగుకు తగ్గింది’’ అని ఆయన చెప్పారు

''పరీక్షలకు ముందు ఈ సమస్య ఎందుకు లేవనెత్తారని మేం అడుగుతున్నాం. మేం తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన ఓ వ్యక్తి తాను లాయర్‌నంటూ మాకు చట్టం గురించి వివరించే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 31 నుంచి ఈ సమస్య మొదలైంది’’ అని రుద్రెగౌడ అన్నారు.

''మా దగ్గర క్రమశిక్షణ లేని విద్యార్ధినులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వారు కాలేజీకి రెగ్యులర్‌గా రారు. టీచర్లతో ఏకవచనంతో మాట్లాడతారు. కాలేజీ 9.15 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత గేట్లు మూసేస్తారు. వారు 11 గంటలకు వచ్చి ఫొటోలు తీసుకుని వాటిని ఆన్‌లైన్‌లో పెట్టి వివాదాలు రాజేస్తుంటారు’’ అని గౌడ అన్నారు.

అయితే, విద్యార్ధిని అల్మాస్ అభిప్రాయాన్నే కాలేజీలో పీఎఫ్ఐ విద్యార్ధి విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) ప్రతినిధి కూడా వినిపించారు. కాలేజీ ప్రిన్సిపల్ వాదనతో విభేదించారు.

''ఫస్టియర్‌లో హిజాబ్‌ని అనుమతించలేదు. కాలేజీకి వచ్చినప్పుడు మా సీనియర్లు బురఖా వేసుకుంటున్నట్లు చూశాం. మాకు అన్యాయం జరిగిందనుకున్నాం. అందుకే హిజాబ్ వేసుకుని వచ్చాం. కానీ అడ్మిషన్ సమయంలో మా పేరెంట్స్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారని కాలేజీ వాళ్లు అన్నారు. గత సంవత్సరం కాలేజీ తెరిచిన రెండు రోజుల తర్వాత కోవిడ్ కారణంగా మా క్లాసులు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి’’ అని అల్మాస్ చెప్పారు.

''ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభమైనప్పుడు మళ్లీ వివాదం మొదలైంది. మిడ్‌టర్మ్ పరీక్షలు అయిపోయిన తర్వాత చూద్దాం అని కాలేజీ యాజమాన్యం తప్పించుకుంది. మేం డిసెంబర్ 29న హిజాబ్ ధరించి వచ్చినప్పుడు మమ్మల్ని క్లాసుల్లోకి రానివ్వలేదు. మా తల్లిదండ్రులు సంతకం చేసిన ఒప్పందంలో కాలేజీ యూనిఫాం మాత్రమే తప్పనిసరి అని ఉంది. హిజాబ్ గురించి ఏమీలేదు’’ అని అల్మాస్ చెప్పారు.

హిజాబ్‌తో క్లాస్‌లోకి అనుమతించనప్పటికీ, తామంతా కాలేజీకి వెళుతున్నామని, తర్వాత హాజరులేదన్న కారణంతో మమ్మల్ని తొలగించే అవకాశం ఉందని నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్ధినులు చెబుతున్నారు.

మమ్మల్ని క్రమశిక్షణ లేని విద్యార్ధులుగా చిత్రించడం సరికాదని నిరసన తెలుపుతున్న విద్యార్ధిని అల్మాస్ అంటున్నారు. మేం హిజాబ్ లేకుండా క్లాసులకు వెళుతున్నామంటూ సోషల్ మీడియాలో అసత్య కథనాలు వచ్చాయని, వాటిని ఖండించేందుకు తాము కాలేజీ మెట్ల మీద కూర్చుని ఫొటోలు దిగామని అల్మాస్ అన్నారు.

తాను సీఎఫ్ఐ సభ్యురాలిని కాదని, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో తాము సీఎఫ్ఐని సంప్రదించినట్లు అల్మాస్ తెలిపారు.

''హిజాబ్ ధరించిన విద్యార్ధులు తరగతికి హాజరు కాకూడదని డిసెంబర్ 27న కాలేజీ యాజమాన్యం ఆదేశించింది. మేము అదనపు డిప్యూటీ కమిషనర్, విద్యాశాఖ అధికారులతో సహా పలువురు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాము. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమీ మారలేదు’’ అని సీఎఫ్‌ఐ కి చెందిన మసూద్ మన్నా అన్నారు.

''హిజాబ్‌ను నిషేధించినట్లు ఏ పుస్తకంలో, ఏ పేపర్‌లోనూ లేదు. దాన్ని నిషేధించామని రాతపూర్వకంగా ఇవ్వడానికి కాలేజీ యాజమాన్యం నిరాకరించింది. హిజాబ్‌ను అనుమతిస్తే కాషాయ దుస్తులను కూడా అనుమతించాలని డిమాండ్‌లు వినిపిస్తాయని వారు చెప్పారు’’ అని మసూద్ అన్నారు.

పరిష్కారం ఏంటి?

''ఈ మొత్తం వ్యవహారంపై నేను నివేదిక కోరాను. ఇది రాజకీయ ప్రోద్బలంతో జరుగుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారు’’ అని ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ బీబీసీతో అన్నారు.

కోస్టల్ బెల్ట్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) గురించి మంత్రి పరోక్షంగా ప్రస్తావించారు. ఎస్‌డీపీఐ అనేది పీఎఫ్ఐ రాజకీయ విభాగం.

విద్యార్ధులు తమ ఇష్టానుసారం దుస్తులు ధరించాలనేది ప్రాథమిక హక్కని, అయితే, విద్యార్ధులంతా యూనిఫాం ధరించేలా చూడటం పాఠశాలకున్న అధికారమని జస్టిస్ ఎ. మహ్మద్ ముస్తాక్ గతంలో తన తీర్పులో పేర్కొన్నారు.

2018లో కేరళలో క్రైస్ట్ నగర్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఇలాంటి వివాదం ఒకటి వచ్చింది. బురఖా ధరించరాదంటూ స్కూలు యాజమాన్యం పెట్టిన నిబంధనలకు వ్యతిరేకంగా ఇద్దరు విద్యార్ధినులు కోర్టుకు వెళ్లారు.

తమను హిజాబ్ ధరించనివ్వడం లేదని, ఫుల్ స్లీవ్ డ్రెస్సులు వేసుకోనివ్వడం లేదని విద్యార్ధినులు ఫిర్యాదు చేశారు.

కేరళ హైకోర్టు ఏం చెప్పింది?

''ఈ కేసులో ప్రధానమైంది స్కూలు యాజమాన్యం. మేనేజ్‌మెంట్ తన బాధ్యతలు నిర్వహించడానికి అనుమతించకపోతే దాని ప్రాథమిక హక్కులను హరించినట్లే. కొందరి హక్కులను నిర్మూలించడం ద్వారా ఒకరి హక్కును రక్షించాలనుకోవాడాన్ని రాజ్యాంగం సమ్మతించదు. ఇలాంటి బహుళ ఆసక్తులను పరిరక్షించాల్సిన సమయంలో సంఘర్షణను నివారించాల్సిన బాధ్యత రాజ్యాంగానికి ఉంది. రెండు ప్రయోజనాలను కాపాడాల్సిన సమయంలో ఎక్కువమంది ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇది స్వేచ్ఛను కాపాడటంలో కీలకం’’ అని కేరళ హైకోర్టు పేర్కొంది.

''హక్కుల విషయంలో పోటీ వచ్చినప్పుడు, వ్యక్తిగత హక్కులను తిరస్కరించడం ద్వారా కాకుండా, ఎక్కువమంది హక్కులను సమర్ధించడం ద్వారా దీనిని నివారించవచ్చు’’ అని జస్టిస్ ముస్తాక్ అభిప్రాయపడ్డారు.

జస్టిస్ ముస్తాక్ ఇచ్చిన తీర్పును ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ (ఎంఈఎస్) వెంటనే అమలులోకి తెచ్చింది. ఈ సంస్థ దాదాపు 100 విద్యా సంస్థలను నడుపుతోంది. తమ సంస్థలలో హిజాబ్‌ను నిషేధించింది.

''హిజాబ్ అనేది కేవలం ఒక డ్రెస్ మాత్రమే’’ అని ఎంఈఎస్ ఛైర్మన్ డాక్టర్ ఫజల్ గఫూర్ బీబీసీతో అన్నారు.

అయితే, కేరళ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు న్యాయవాది కాళేశ్వరన్ రాజ్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.

''విద్యార్ధుల హక్కులకు, మేనేజ్‌మెంట్ హక్కులకు పోటీ పెట్టడం సరికాదు. ఒక హక్కు ఎవరికి ఉందో ఎవరికి లేదో చెప్పాలి. ఆర్టికల్ 25 స్ఫూర్తిని కాపాడాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యార్థి హిజాబ్‌తో తరగతిలో కూర్చోవచ్చా?

''ఒక ఉపాధ్యాయుడు తాను చెప్పిన అంశాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడో లేదో అతని ముఖ కవళికలను చూసి తెలుసుకోవాలనుకోవడం సహజం. తల మీద మాత్రమే హిజాబ్ ధరిస్తున్నామని, ముఖం మీద కాదని చెబితే అది కొంత వరకు సరైనదే. అల్మాస్‌ చెప్పినట్లుగా ముఖం కనిపిస్తోందని విద్యార్ధి వాదిస్తే అప్పుడు ఉపాధ్యాయుడుగానీ, యాజమాన్యంగానీ హిజాబ్ ధరించరాదని పట్టుబట్టలేరు’’ అని కాళేశ్వరన్ రాజ్ అన్నారు.

''యూనిఫామ్‌గా ఉండాలన్న కారణంతో జుత్తు వరకు కప్పుకోవాడాన్ని కూడా యాజమాన్యం నిషేధించలేదు. ఎందుకంటే దీన్ని రాజ్యాంగం అంగీకరించదు. భిన్నత్వాన్ని మన రాజ్యాంగం పరిరక్షిస్తుంది’’ అని రాజ్ అభిప్రాయపడ్డారు.

''అంటే ఇది కోర్టులో మాత్రమే తేల్చగల అంశమా’’ అన్నప్పుడు 'అవును’ అన్నారు రాజ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Karnataka: Why the girls took a strong call to wear Hijab in class room, and why the Prinicpal stopping them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X