మొదటి భార్య కుమారుడు.. రెండో భార్య మధ్య అక్రమ సంబంధం: విద్యాసంస్థల అధినేత దారుణ హత్య:
బెంగళూరు: ఉత్తర కర్ణాటకలోని విజయపురా జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యాసంస్థల గ్రూపు అధినేత హత్యోదంతం చిక్కుముడి వీడింది. ఆయన హత్య కేసులో అయిదుమందిని పోలీసులు అరెస్టు చేశారు. హతడి మొదటి భార్య కుమారుడు, రెండో భార్య మధ్య అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని పోలీసులు నిర్ధారించారు. వారిద్దరినీ ప్రధాన నిందితులుగా గుర్తించారు. వారిద్దరితో పాటు మరో ముగ్గురిని ఆదివారం అరెస్టు చేశారు. మీడియా ముందు ప్రవేశపెట్టారు.
కర్ణాటకలో కొత్త రకం వైరస్: ప్రమాదకరంగా వ్యాప్తి: ఇప్పటికే ఇద్దరు బలి: 55 మందిలో పాజిటివ్..!

విజయపురా జిల్లాలో కలకలం రేపిన హత్య..
హతుడి పేరు దాము నాయక్. విజయపురా జిల్లాలోని బసవన బాగేవాడిలో గల మడివాళేశ్వర గ్రూపు విద్యాసంస్థల అధినేత. కిందటి నెల 25వ తేదీన ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హంతకులు ఆయనను గొంతు కోసి హత్య చేశారు. విద్యాసంస్థల గ్రూపు అధినేత కావడంతో జిల్లాలో ఈ హత్యోదంతం కలకలానికి దారి తీసింది. ఈ ఘటనపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, హంతకుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టింది.

పాత కక్షలుగా అనుమానించినా..
దాము నాయక్ హత్యను తొలుత పాతకక్షల వల్లే చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. ఆయనతో శతృత్వం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. సుమారు 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించినప్పటికీ.. పోలీసులకు ఎలాంటి లీడ్ చిక్కలేదు. దీనితో- వారి దృష్టి కుటుంబ సభ్యులపై పడింది. దాము నాయక్‌కు పెద్ద ఎత్తున ఆస్తులు ఉండటం, రెండు పెళ్లిళ్లు చేసుకోవడం.. ఈ రెండు కోణాల్లో విచారణ సాగించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మొదటి భార్య కుమారుడు.. రెండో భార్య మధ్య అక్రమ సంబంధం
కుటుంబ సభ్యులను విచారిస్తున్న సందర్భంగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాము నాయక్ మొదటి భార్య కుమారుడు సుభాష్ నాయక్.. రెండో భార్య ప్రేమా దాము నాయక్ మధ్య ఏర్పడిన అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని తేలింది. దాము నాయక్‌ను అడ్డు తొలగించుకుంటే.. కోట్లాది రూపాయల ఆస్తి తమ వశం అవుతుందని నిందితులు భావించారని, ఆయనను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.

లక్షల రూపాయలు సుపారీగా..
సుభాష్ నాయక్, ప్రేమా నాయక్‌లతో పాటు అశోక్ లమాణి. అవ్వణ్ణ గ్వాతగి, శివణ్ణ కొణ్ణూర్‌లను అరెస్టు చేశారు పోలీసులు. దాము నాయక్‌ను హత్య చేయడానికి అశోక్ లమాణి, అవ్వణ్ణ గ్వాతగి, శివణ్ణ కొణ్ణూర్‌లకకు లక్షలాది రూపాయలను సుపారీగా ఇచ్చారని వెల్లడించారు. దాము నాయక్‌ను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని అన్నారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సెల్ ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications