వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథా నిలయం: తెలుగు కథలన్నీ చేరుకునే కంచి ఇదే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కథానిలయాన్ని తెలుగు కథల గుడిగా అభివర్ణిస్తారు సాహితీవేత్తలు
Click here to see the BBC interactive

కథలన్నీ కంచికి చేరతాయో చేరవోగానీ, తెలుగు భాషలో అచ్చయిన తొలి కథ నుంచి నిన్న ప్రచురితమైన కథ వరకు శ్రీకాకుళంలోని ఈ ఇంటికి మాత్రం చేరతాయి. ఇప్పటికే ఎన్నో కథలు చేరాయి, ఇంకా చేరుతూనే ఉన్నాయి. తెలుగు సాహితీ లోకంలో పుట్టుకొచ్చిన కథలన్నీ ఇక్కడ పదిలంగా ఉంటున్నాయి. అవన్నీ కలిసి కట్టుకున్న ఆ ఇంటిపేరే 'కథానిలయం'.

తెలుగు సాహిత్యంలో పుట్టిన కథలన్నీ సేకరించడం, ఒకచోట చేర్చడం, వాటిని భవిష్యత్ తరాలకు అందేలా ఆధునిక పద్ధతుల్లో భద్రపరచడం మామూలు విషయం కాదు. కానీ ఆ కార్యక్రమం ఇక్కడ నిర్విఘ్నంగా కొనసాగుతోంది.

కథానిలయంలో సుమారు లక్ష వరకు కథలున్నాయి

కథా నిలయం కథేంటి...?

1997 ఫిబ్రవరి 22న 'కథానిలయం' ప్రారంభమైంది. 'కారా’ మాస్టారుగా ప్రసిద్ధి పొందిన రచయిత, కథకులు, విమర్శకులు కాళీపట్నం రామారావు ఆలోచనే కథానిలయం.

తెలుగులో కథలు అనేకం ఉన్నాయి. అయితే వాటిని ఒకచోటకు తీసుకుని వచ్చి... తెలుగు కథలకు ఓ నిలయం లాంటిది ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. ఉపాధ్యాయుడిగా రిటైరైన 'కారా’ తన రచనల ద్వారా సమాజానికి నిరంతరం సేవ చేస్తున్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ద్వారా లభించిన రివార్డు, కొందరు సాహిత్యవేత్తల సహకారంతో 8 వేల కథల పుస్తకాలను ఒక్కచోటకు తీసుకు వచ్చి కథానిలయాన్ని ప్రారంభించారు 'కారా'. నేడు ఆ కథల సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది.

కాళీపట్నం రామారావు వయసు ప్రస్తుతం 97 ఏళ్లు. కథానిలయం ప్రారంభించి 24 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీబీసీ ఆయనతో మాట్లాడింది.

"పూర్వం నవలలే ఉండేవి. అవి చదవడానికి చాలా సమయం పట్టేది. అందుకే చాలామంది వదిలేసేవారు. కథ చదవడం సులభం. అందుకే చాలామంది కథలు రాయడం మొదలుపెట్టారు. అటువంటి కథలను ఒకచోట పదిలపరచడం మంచిదనుకుని ఈ కథానిలయం స్థాపించాను” అన్నారు కాళీపట్నం రామారావు.

“కథ సమాజంలో మార్పు తీసుకొస్తుంది. కథ లక్ష్యం, లక్షణం కూడా అదే అయ్యుండాలి” అంటారాయన.

“కథల లక్ష్యం పాఠకులను రంజింపజేయడం కాదు. సాధారణ మానవుడు గ్రహించలేని, జీవిత సత్యాలను గ్రహించగలిగేలా చేయడానికి ఇవి అవసరం. కథలు సమాజంలో మార్పుకు కారణమవుతాయి. అటువంటి కథలను ఒకచోట చేర్చడం ద్వారా భవిష్యత్తు తరాలకి గత కాలపు చరిత్ర, వ్యవహారాలు, పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. కథంటే ప్రవహించే నదిలాంటిది. అది అందరి దరికి చేరాలి. దానికి కథానిలయం ఉపయోగపడుతుంది" అని అంటారు కాళీపట్నం రామారావు.

కథానిలయం కోసం కాళీపట్నం రామారావు చాలా వరకు తన డబ్బును ఖర్చు పెట్టారు.

కథకి ఇల్లు ఇంకెక్కడా లేదు

కథా ప్రక్రియకు సంబంధించిన పుస్తకాలన్నీ ఒకేచోట ఉండటం బహుశా మరెక్కడా లేదని సాహిత్యాభిమానులు అంటున్నారు.

“కథానిలయం భవిష్యత్‌ తరాలకు ఒక గొప్పవరం. ఒక కథ రచనకు కథకుడు ఎంతో శ్రమిస్తాడు. ఎంతో అనుభవాన్ని పొందుతాడు. ఆ శ్రమ, అనుభవాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఉండేందుకు తాను ఏం చేయగలనని కారా మాస్టారు నిరంతరం ఆలోచించేవారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే కథానిలయం” అని కథానిలయ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అట్టాడ అప్పలనాయుడు బీబీసీతో అన్నారు.

“ఆయన కృషిలో భాగస్వాములమై తెలుగు కథకి మా వంతుగా సేవ చేస్తున్నందుకు గర్వపడుతున్నాం” అన్నారాయన.

"కథకి ఇల్లు కట్టి దానికి కథానిలయం అని పేరు పెట్టారు. బీరువాలు, అరలలో పుస్తకాలు, గోడలపై రచయితల ఫొటోలను పెట్టి 800 పుస్తకాలతో కథానిలయం ప్రారంభించారు. దాని పక్కనే ఇల్లు కట్టుకుని కథ కోసం పని చేశారు.

ఆరోగ్యం బాగా లేకపోయినా కథలు, వాటి చర్చలంటే మాత్రం ఎక్కడలేని ఉత్సాహం వస్తుందాయనకు. కథల సేకరణ కోసం ఉత్తరాలు రాయడం, అవి ఎక్కడ దొరుకుతాయో అక్కడికి స్వయంగా వెళ్లడం, ఒకటికి పదిసార్లు తిరగడం… కథల కలెక్షన్‌కు ఇలా ఆయన ఎంతో కష్టపడ్డారు. దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వర్తమాన, భవిష్యత్‌ తరాలపై ఉంది" అని అప్పలనాయుడు అన్నారు.

తెలుగు కథల డిజిటలైజేషన్

800వందల పుస్తకాలతో 1997లో మొదలైన కథానిలయం ప్రస్తుతం దాదాపు లక్ష కథలకు వేదికగా మారింది. సంపుటాలు, సంకలనాలు, పుస్తకాలుగా వచ్చినవాటితోపాటు అనేక పత్రికల్లో వచ్చిన కథలను కూడా రామారావు సేకరించారు.

కథల వివరాలు మొదట్లో పుస్తకాల్లో రాసేవారు. అయితే ఇలా కథానిలయం చేరిన కథలన్ని కొద్ది కాలానికే చెదలు పట్టడమో, చిరిగిపోవడమో జరిగే ప్రమాదం ఉంది. అందుకే వీటిని డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతో ఆ పనికి పూనుకున్నారు రామారావు.

ఆర్థిక పరిమితులరీత్యా కథానిలయంలోని కథల డిజిటలైజేషన్, kathanilayam.com వెబ్‌సైట్‌ను బెంగళూరుకి చెందిన మ.న.సు. (మన్నం నరసింహం, సుబ్బమ్మ) ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది.

"సాహితీవేత్తలు, సాహిత్యాభిమానుల సహకారంతో కథల డిజిటల్ డేటాబేస్ మొదలైంది. క్రమంగా పుస్తకాల రూపంలో ఉన్న కథలు డిజిటల్‌ డేటా రూపంలోకి మారుతున్నాయి.

మ.న.సు. ఫౌండేషన్‌తోపాటు ఆంధ్రభారతి, తెలుగు ఫౌండేషన్ సహాకారం కూడా తోడైంది. దీంతో కథల పుస్తకాల స్కానింగ్‌తో పాటు తెలుగులో వెలువడిన సాహిత్య గ్రంథాలన్నీ స్కాన్‌ రూపంలో అందించే విధంగా కథానిలయం వెబ్ సైట్ రూపొందింది.

ఈ వెబ్‌సైట్‌లో కథ వివరాలు స్పష్టంగా ఉంటాయి. రచయిత, చిరునామా, ఎటువంటి కథ, కథానిలయంలో అది ఏ విభాగంలో ఉంది? దాని నెంబరెంత? ఇలా ప్రతి వివరం ఉంటుంది.

భౌతిక రూపంలో ఉన్న తెలుగు కథని డిజిటల్‌ రూపంలోకి మార్చి... ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది కథానిలయం.

“24వ వార్షికోత్సవ సమయానికి 96,653 కథలు కథానిలయంలో ఉంటే అందులో 48 వేలకు పైగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇది భవిష్యత్‌ తరాలకు కథానిలయం అందించే తరగని ఆస్తి" అని కథానిలయం నిర్వాహణ బాధ్యతలు చూస్తున్న కాళీపట్నం రామారావు కుమారుడు కాళీపట్నం సుబ్బారావు బీబీసీతో అన్నారు.

లక్ష కథల నిలయం

శ్రీకాకుళంలోని విశాఖ-ఏ కాలనీలో ఉన్న కథానిలయానికి సాహిత్యంపై అభిమానం, అవగాహన ఉన్నవారు వస్తూనే ఉంటారు. రెండు అంతస్థులుగా ఉన్న ఈ నిలయం కింది అంతస్తులో రిఫరెన్స్‌ పుస్తకాలు, పై అంతస్తులో లైబ్రరీ ఉంటాయి. ప్రవేశం ఉచితం.

కథానిలయంలో ఎటుచూసినా పుస్తకాలే కనిపిస్తాయి. గదుల నిండా ఉన్న బీరువాలలో, అరల్లో, టేబుళ్లపై, కూర్చీలలో కూడా పుస్తకాలే ఉంటాయి. కథానిలయం గోడలకు అనేకమంది కథారచయితల ఫొటోలు వేలాడుతూ కనిపిస్తాయి.

"ఇప్పటి వరకు తెలుగులో అచ్చైన పత్రికలలోని 90 శాతం కథలు కథానిలయంలో ఉన్నాయి. అలాగే దాదాపు లక్ష వరకు కథలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అపురూపంగా దాచుకోవాల్సిన కథలను పెట్టెలో పెట్టి తాళం వేస్తాం. వాటిని చాలా భద్రంగా చూసుకుంటాం. వీటిని ఎవరైనా రిఫరెన్స్ కోసం అడిగితే మాత్రం ఇస్తాం.

సాహిత్య పరిశోధకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కూడా ఇక్కడికి వచ్చి వారికి కావలసిన సమాచారాన్ని తీసుకుంటారు. తెలుగులో మొదటి కథ నుంచి అన్ని తెలుగు కథలను కథానిలయం సేకరించింది.

అనేకమంది ప్రముఖ రచయితలు, కథకులు, విమర్శకులు, సాహితీవేత్తలు కథానిలయాన్ని సందర్శించారు. ఇక్కడ తెలుగు కథల కోసం జరుగుతున్న యజ్ఞాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇటువంటి ప్రక్రియ ప్రపంచంలోనే మరెక్కడా లేదని సి.నారాయణ రెడ్డి, గొల్లపూడి మారుతీరావు, త్రిపురనేని మహారధి, బాపు, రమణలవంటి ప్రముఖులు తమ సంతకాలతో పంపిన అభిప్రాయాల ప్రతులను ఇక్కడ పదిలపరిచాం" అని కథానిలయం అధ్యక్షులు బీవీఏ రామారావు నాయుడు బీబీసీకి చెప్పారు.

తెలుగు రచయితల చిరునామా

తెలుగు కథ పుట్టినప్పటి నుంచి నేటి వర్థమాన కథకుల రచనలన్నింటిని సేకరించే పనిలో కథానిలయం తలమునకలైంది. ఏ మార్గంలో వీలైతే ఆ మార్గంలో నిర్వాహకులు కథలను సేకరిస్తారు.

కథానిలయం వెబ్‌సైట్‌లో ఉన్న కథలలో వివిధ మాధ్యమాల నుంచి తీసుకున్నవి కూడా చాలా ఉన్నాయి. అలా తీసుకున్న కథల రచయితల పూర్తి వివరాలను కూడా వెబ్‌సైట్‌లో చేర్చారు.

తమ కథలను వెబ్‌సైట్లో పెట్టడానికి వాటి రచయితలెవరైనా అభ్యంతరాలు చెబితే వాటిని తొలగిస్తారు. ఇప్పటి వరకూ 16,741 మంది రచయితల కథలు, వారి బయోడేటాలు కథానిలయం వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

"కథానిలయం రెండో అంతస్తులో ప్రముఖ తెలుగు కథకుల ఫొటోలు ఉన్నాయి. వాటిని చూస్తుంటే తెలుగు రచయితల ఛాయాచిత్ర గ్రంథాలయంలా అనిపిస్తుంది. గురజాడ నుంచి నేటి తరం కథకుల వరకూ అందరి చిత్రపటాలకు ఇక్కడ స్థానం కల్పించారు. కథా నిలయాన్ని వందేళ్ల తెలుగు కథా సాహిత్యానికి, తెలుగు కథ రచయితలకూ చిరునామాగా నిలిపారు” అని తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు ఐ. ప్రసాదరావు బీబీసీతో అన్నారు.

“ఇక్కడికి వస్తే కథలతో స్నేహం చేస్తున్నట్లు ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆయా కాలాల కథలు చదువుతుంటే అప్పటి వ్యక్తులతో నేరుగా మాట్లాడినట్లుంటుంది. భవిష్యత్తు తరాలు గత కాల అనుభవాలు, చరిత్రను తెలుసుకునేందుకు కథానిలయం పెద్ద సంపద" అని అన్నారాయన.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Katha Nilayam: All Telugu stories come to an end here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X