కెసిఆర్: సోనియాకు ప్రశంసలు, విలీనంపై మాట్లాడలేదు
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశంసించారు. కానీ కాంగ్రెసులో పార్టీ విలీనం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో కాంగ్రెసులో తెరాస విలీనమవుతుందా, లేదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
మరో మూడు రోజుల్లో తాను హైదరాబాద్‌కు తిరిగి వస్తానని, అప్పుడు అన్ని విషయాలూ మాట్లాడుకుందామని శుక్రవారం తనను కలిసిన నాయకులతో కెసిఆర్ చెప్పారు. అయితే విలీనంపై మాత్రం ఆయన పెదవి విప్పటం లేదని తెలిసింది. కొద్ది రోజుల కిందట తన కుమారుడు కెటి రామారావును వెంటబెట్టుకుని సోనియాను కలిసినప్పుడు జరిగిన భేటీలో తెలంగాణ బిల్లును ఎలా ఆమోదింపజేయాలి, కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా ఎలా ముగించాలి అనే అంశాలపైనే సోనియాగాంధీ మాట్లాడారని తెలిపారు.

తమ మధ్య జరిగిన చర్చలో సోనియాగాంధీ ఎక్కడా విలీనం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని కెసిఆర్ స్పష్టం చేశారు. సోనియాగాంధీ చాలా గొప్ప నాయకురాలని, ఆమె వల్లే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు.
సోనియాగాంధీని కెసిఆర్ స్వయంగా కలిసి తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెబుతారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎప్పుడు కలుస్తారనేది తెలియడం లేదు. అయితే ఈ సందర్భంగా విలీనం గురించి ప్రస్తావన రావచ్చునని అంటున్నారు. తెరాస విలీనం గురించి కాంగ్రెసు నాయకులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications