జనతా దర్బార్: కేజ్రివాల్‌కు తొక్కిసలాట భయం
న్యూఢిల్లీ: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన జనతా దర్బార్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఢిల్లీ సెక్రటేరియట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శనివారం నిర్వహించిన జనతా దర్బార్‌కు వేలాది మంది ప్రజలు చేరుకోవడంతో తొక్కిసలాడే ప్రమాదం ఉందని భావించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పోలీసుల సూచనతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాము ఇంకా ఎక్కువగా మెరుగైన ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని కేజ్రివాల్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తాను ఇక్కడి నుంచి వెళ్లిపోకపోయినట్లయితే తొక్కసలాట జరిగే ప్రమాదముందని కేజ్రివాల్ అన్నారు. అందుకే తాను వెళ్లాల్సి వస్తోందని ఆయన చెప్పారు. మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో మరో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో వారం ఒక్కో అంశంపై జనతా దర్బార్ పెట్టకపోతే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఫిర్యాదుల్లో అధిక శాతం అధికారులపైనే వచ్చాయని కేజ్రివాల్ వెల్లడించారు.

వచ్చిన వారిలో కొంతమంది అభినందనలు తెలియజేసేందుకు వచ్చారని కేజ్రివాల్ తెలిపారు. తొలిరోజు కావడంతో అధిక సంఖ్యలో వచ్చిన వారిని అదుపు చేయడంలో కొంత ఇబ్బంది కలిగిందని అన్నారు. మరోసారి జనతా దర్బార్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని తెలిపారు. పోలీసుల అంచనా ప్రకారం సుమారు 50వేల మంది ప్రజలు సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు. దీంతో ముందుగా ఏర్పాటు చేసిన బారికేడ్లు కూడా ఎక్కడికక్కడ కూలిపోయాయి.

అరవింద్ కేజ్రివాల్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. ఆప్ పార్టీకి చెందిన మరో ముగ్గురు మంత్రులు సోమనాథ్ భారతి, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్‌లు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కాగా తాను కేజ్రివాల్‌ను కలిసేందుకు సీలంపూర్ నుంచి వచ్చానని, అయితే ఇక్కడ పరిస్థితి అందుకు అనుకూలంగా లేదని, ఇలాంటి ఇరుకైన ప్రదేశంలో జనతా దర్బార్ పెట్టడం వల్ల తొక్కిసలాట ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఫిర్యాదుదారుడు సోనూ శర్మ పేర్కొన్నాడు. విద్యుత్ అధికారులు తనకు అన్యాయంగా రూ. 2.96 లక్షలు జరిమానా విధించారని తెలిపారు.












Click it and Unblock the Notifications