చోటా మోడీ పారిపోయాక.. బిల్లు తెస్తారా?: కేంద్రంపై కేజ్రీవాల్ ఎద్దేవా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వేల కోట్ల ముంచి దేశం విడిచి పారిపోతున్న నిందితుల ఆస్తులను జప్తు చేసి అమ్మేసేందుకు వీలుగా ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
అయితే, పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు చిన్న మోడీ(నీరవ్ మోడీ)ని దేశం విడిచి వెళ్లే వరకూ స్పందించని మోడీ.. ఇప్పుడు ఈ బిల్లు తేవడం ఏంటని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
पहले छोटे मोदी को भगा दिया, अब बिल ला रहे हो? https://t.co/qo1d1bPMOZ
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 1, 2018
కాగా, కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు, 2017ను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిపారు.
వందలు, వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయేవారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, విక్రయించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటవుతుందని అరుణ్ జైట్లీ తెలిపారు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం ఈ కేసులపై విచారణ జరుగుతుందన్నారు. విదేశాలకు పారిపోయినవారి అన్ని ఆస్తులను, బినామీ ఆస్తులతో సహా, జప్తు చేయడానికి ఈ బిల్లు ప్రతిపాదించిందన్నారు.












Click it and Unblock the Notifications