కేరళ విలయం: మట్టికొట్టుకుపోయిన గ్రామాలు: 42 మంది మృతి: అంతకంతకూ మరణాలు
Kerala landslides: కేరళలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 42 మంది మరణించారు. 400 మందికి పైగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. మరిన్ని మృతదేహాలు వెలుగులోకి రావొచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. దీనికోసం ఆర్మీ హెలికాప్టర్లను వినియోగిస్తోన్నారు. కొండచరియలు విరిగిపడటం వల్ల చిక్కుకున్న గ్రామాలవారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోన్నారు.

వాయనాడ్ జిల్లాలో ఈ తెల్లవారు జామున ఈ ఉదంతం సంభవించింది. కేరళలో కొద్దిరోజులుగా ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేెకించి- కేరళ ఉత్తరప్రాంతంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటోంది. చెరువులు, కుంటలు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.
భారీ వర్షాల తాకిడికి వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని మెప్పాడి, ముండక్కై టౌన్, చూరల్‌మాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగి జనావాసాల మీద పడ్డాయి. అదే సమయంలో బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది.

అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు తొలి దుర్ఘటన సంభవించింది. ముండక్కై టౌన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. తెల్లవారు జామున 4 గంటల సమయంలో చూరల్‌మాలాలో రెండో ప్రమాదం చోటు చేసుకుంది. చూరల్‌మాలాలో గల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో ఉన్న వాళ్లు ప్రమాదానికి గురయ్యారు. చుట్టు పక్కల ఉన్న నివాసాలు దెబ్బతిన్నాయి.
కోజికోడ్ జిల్లా వనిమాళ్ గ్రామ పంచాయితీ పరిధిలోని విలంగాడ్ వద్దా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆయా ఘటనల్లో ఇప్పటివరకు 42 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. 400 మందికి పైగా చిక్కుకుపోయారు. 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు- కేరళ నదులన్నీ కూడా వరద నీటితో ఉగ్రరూపాన్ని ధరించాయి. బాణాసుర రిజర్వాయర్, ఇడుక్కి డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే వరద నీటితో పోటెత్తుతున్న నదులకు ఇవి కూడా తోడు కావడం విలయాన్ని సృష్టించింది.
పణమారంపుజ, కరమంథోళ్, కబిని నదులు వరద తాకిడికి గురయ్యాయి. వాటిపై నిర్మించిన పలు వంతెనలు ధ్వంసం అయ్యాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల బురద, చెట్లు.. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొస్తోన్నాయి. తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications