కేరళలో తగ్గేదెలా అంటున్న కరోనా: మూడో రోజూ 22వేలకుపైనే కొత్త కేసులు, యాక్టివ్ కేసుల్లో 37శాతం
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. కేరళ రాష్ట్రంలో మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళ నెంబర్ 1 హాట్ స్పాట్‌గా మారిపోయింది. కరోనా కేసులు భారీగా నమోదువుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం చర్యలకు అపక్రమించింది. శని, ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.

కేరళలో మూడోరోజూ 22వేలకుపైనే కరోనా కొత్త కేసులు
కాగా, వరుసగా మూడో రోజు గురువారం కూడా కొత్తగా 22,064 కరోనా కేసులు నమోదు కాగా, 128 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33,49,365కి చేరింది. మరణాల సంఖ్య 16,585కి పెరిగింది. గత 24 గంటల్లో కేరళలో 1,63,098 నమూనాల పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మలప్పురం జిల్లాలో రికార్డు స్థాయిలో 3679 కరోనా కేసులు నమోదు కాగా, త్రిస్సూరు జిల్లాలో 2752, కోజికోడ్‌లో 2619, ఎర్నాకుళంలో 2359, పాలక్కడ్‌లో 2034 చొప్పున కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో 37శాతం కరోనా యాక్టివ్ కేసులు కేరళలోనే..
కాగా, దేశంలో ప్రస్తుతం 4.03 లక్షల యాక్టివ్ కేసులుండగా.. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 1.5 లక్షల(37 శాతం) క్రియాశీల కేసులున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) డైరెక్టర్ ఎస్కే సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందాన్ని కేరళకు పంపిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Recommended Video

భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ మొదలైందా.?
మరోవైపు, కేరళలో కరోనా కేసుల విజృంభణ చూస్తుంటే థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లుగా కనబడుతోందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే అన్నారు. మే నెలలో సెకండ్ వేవ్‌లో కేరళలో రోజుకు 43వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ కేరళలో కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉండటం గమనార్హం. కాగా, కర్ణాటకలోనూ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 2052 కొత్త కేసులు నమోదు కాగా, 35 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం కర్ణాటకలో 36,491 యాక్టివ్ కేసులున్నాయి












Click it and Unblock the Notifications