పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న కీలక సూత్రదారి ఇతడే..!
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీపంలో ఉండే బైసరన్ లోయలో పర్యటిస్తున్న పర్యాటకులపై టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది మరణించినట్లు సమాచారం. అంతే కాకుండా తీవ్రంగా గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చనిపోయిన వారిలో హైదరాబాద్ కు చెందిన నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్ తో పాటు కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్ర దాడిగా అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. పహల్గాం మొత్తం రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే ప్రధాని మోదీ రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపధ్యంలో జెడ్డా నుంచి బయల్దేరి.. ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రమంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నట్టు సమాచారం. ఇక ఈ దాడిని పలు దేశాల అధ్యక్షులు సైతం ఖండిస్తున్నారు. భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.
ప్రధాన సూత్రదారి ఇతడే..
దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో దాడికి పాల్పడిన వారిని వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి. అయితే పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న 'లష్కరే తోయిబా' అనుబంధ సంస్థ 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అని ప్రకటించుకుంది. దాంతో జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే, టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక.. ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఈ దాడులకు అతనే ప్రధాన సూత్రధారి అని జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
అంతకు కూడా కూడా భారతదేశంలో జరిగిన అనేక పలు ప్రధాన ఉగ్రవాద దాడులలో సైతం ఇతని పేరు ప్రస్తావించబడిందని వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద దాడికి కేవలం రెండు నెలల ముందు కూడా సైఫుల్లా ఖలీద్ పాకిస్థాన్ పంజాబ్‌లోని కంగన్‌పూర్ లో పర్యటించినట్టు తెలుస్తోంది. అక్కడి పాకిస్థాన్ బెటాలియన్ లో జిహాదీ ప్రసంగం చేయడానికి ఇతడిని ఆర్మీ కల్నల్ జాహిద్ జరీన్ ఖట్టక్ ఆహ్వానించినట్టు సమాచారం. అంతే కాకుండా సైఫుల్లాఈ ఖలీద్ అక్కడికి చేరుకోగానే పాక్ కల్నల్ స్వయంగా అతనిపై పూల వర్షం కురిపించినట్టు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి.












Click it and Unblock the Notifications