రూ. 17 కోట్లకు చెక్ లు ఇచ్చి ఎన్నికల్లో పోటీ. చెక్ లు ఇచ్చేయాలని కేజీఎఫ్ బాబు డిమాండ్ !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అనుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ అడిగారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర మంచి పేరు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి అతను ఓడిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ఓడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి తనకు ఓటు వేసి గెలిపించాలని ఏకంగా రూ. 17. 30 కోట్ల రూపాయలకు చెక్ లు ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఆ లీడర్ ఇప్పుడు తాను ఇచ్చిన చెక్ లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరు సిటీలోని చిక్కపేట నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడు కేజీఎఫ్ బాబు అనుకున్నారు.

అయితే కేజీఎఫ్ బాబుకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చివరికి మాజీ ఎమ్మెల్యే ఆర్ వీ. దేవరాజ్ కు టిక్కెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా కేజీఎఫ్ బాబు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదే సమయంలో చిక్కపేట్ లోని పలు మసీదులకు రూ. 17. 30 కోట్లకు చెక్ లు ఇచ్చారు. తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు ప్రచారం చెయ్యాలని మసీదు పెద్దలకు కేజీఎఫ్ బాబు మనవి చేశారు.
బీజేపీ నుంచి ఉదయ్ గరుడాచార్ పోటీ చేశారు. చిక్కపేట్ లో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరిగింది. చివరికి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చీలిపోయింది. బీజేపీ అభ్యర్థి ఉదయ్ గరుడాచార్ కు 57, 299 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆర్ వీ. దేవరాజ్ కు 45, 186 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేజీఎఫ్ బాబుకు 20, 931 ఓట్లు వచ్చాయి.
చిక్కపేట్ లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చీలిపోవడంతో ఆర్. వీ. దేవరాజ్ ఓడిపోయారు. ఆర్ వీ దేవరాజ్ ను ఓడించిన కేజీఎఫ్ బాబు కూడా ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేజీఎఫ్ బాబు తాను మసీదులకు ఇచ్చిన చెక్ లు తిరిగి ఇవ్వాలని, ఎవ్వరూ బ్యాంకుల్లో చెక్ లు డిపాజిట్ చేసి నగదు డ్రా చెయ్యకూడదని ఏకంగా ఉర్దూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు.

మసీదులకు దానంగా ఇచ్చిన చెక్ లు తిరిగి ఇవ్వాలని ఏకంగా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో చిక్కపేట్ లోని మసీదుల పెద్దలు కేజీఎఫ్ బాబు మీద మండిపడుతున్నారు. చిక్కపేట్ లోని మసీదులను టార్గెట్ చేసి కేజీఎఫ్ బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఎవ్వరూ కూడా చెక్ లు కేజీఎఫ్ బాబుకు వాపస్ ఇవ్వకూడదని బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్ గరుణాచార్ మసీదు పెద్దలకు చెబుతున్నారు.
బ్యాంకులో ఆ డబ్బులు డ్రా చేసుకోవాలని. చెక్ లు బౌన్స్ అయితే కేజీఎఫ్ బాబు మీద చీటింగ్ కేసు పెట్టాలని, మసీదు పెద్దలకు తాను అండగా ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ మసీదు పెద్దలకు చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి కేవలం మసీదులకు మాత్రమే రూ. 17. 30 కోట్ల కు కేజీఎఫ్ బాబు చెక్ లు ఇచ్చాడని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications