విందు: మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామా
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం తెల్లవారుజామున(అమెరికాలో సోమవారం రాత్రి) అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. మోడీకి విందును ఏర్పాటు చేశారు. మోడీ, ఒబామాలు పలు అంశాలపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా మోడీకి బరాక్ ఒబామా గుజరాతీ భాషలో స్వాగతం పలకడం విశేషం.
‘కెమ్ చో(బాగున్నారా?)' అని ప్రధాని మోడీ మాతృభాషలో అమెరికా అధ్యక్షుడు ఒబామా పలకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ఒబామాకు భగవద్గీతను అందించారు. తొలిసారి ఈ విందును ఇరు దేశాధినేతలు పలు అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసినట్లు అక్కడి వర్గాలు తెలిపాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

ఈ విందుకు మరో 20మంది ప్రతినిధులు హాజరయ్యారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జోయి బిడెన్, స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ, ఎన్ఎస్ఏ సుసన్ రైస్ విందులో పాల్గొన్న వారిలో ఉన్నారు. మోడీతోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, అమెరికాలో ఇండియన్ అంబాసిడర్ జయశంకర్, తదితరులు ఉన్నారు. ఈ విందు కార్యక్రమంలో వైట్ హౌజ్‌లోని బ్లూ రూంలో జరిగింది.
మోడీకి ఒబామా విందు ఇస్తున్న సందర్భంగా భారత సంతతికి చెందిన పలువురు వైట్ హౌజ్ ముందు గుజరాతీ సంప్రదాయ నృత్యమైన గర్భా నృత్యాన్ని చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మోడీ-ఒబామా భేటీ సందర్భంగా వైట్ హౌజ్ పరిసరాల్లో అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. కాగా, పెన్సిల్వేనియా సమీపంలో మోడీ పర్యటనకు నిరసన తెలిపిన కొందరికి, భారీగా చేరిన మోడీ మద్దతుదారులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.












Click it and Unblock the Notifications