వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖుదీరామ్ బోస్: 18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన యోధుడు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఖుదీరామ్ బోస్

లార్డ్ కర్జన్ 1905 జూలై 19న బెంగాల్‌ను విభజించాలనే నిర్ణయం తీసుకోగానే కేవలం బెంగాల్‌లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆంగ్లేయులపై ఆగ్రహం పెల్లుబికింది.

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రతీచోటా నిరసన ర్యాలీలు, విదేశీ వస్తువుల బహిష్కరణ జరిగింది. పత్రికల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి.

అదే సమయంలో స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్రనాథ్ దత్, 'జుగంతర్’ వార్తా పత్రికలో ఒక కథనాన్ని రాశారు. ప్రభుత్వం దాన్ని రాజద్రోహంగా పరిగణించింది.

కలకత్తా ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్ ఈ కథనాన్ని రాసినందుకు భూపేంద్రనాథ్‌కు ఏడాది పాటు జైలు శిక్ష విధించడమే కాకుండా పత్రికా రంగాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసేందుకు డగ్లస్ తీసుకున్న ఈ నిర్ణయం ఆజ్యం పోసింది.

అంతేకాకుండా 'వందేమాతరం’ అంటూ నినాదాలు చేసిన ఒక 15 ఏళ్ల విద్యార్థిని 15 కొరడా దెబ్బలు కొట్టాలనే కఠినమైన శిక్షను కూడా డగ్లస్ విధించారు.

దీని తర్వాత 1907 డిసెంబర్ 6వ తేదీ రాత్రి పూట మిద్నాపూర్ జిల్లా నారాయణగఢ్ సమీపంలో బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆండ్రూ ఫ్రేజర్ రైలును బాంబుతో పేల్చేయడానికి ప్రయత్నించారు.

ఇది జరిగిన కొన్ని రోజులకే చంద్రనాగోర్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ రైలును పేల్చేయడానికి మరో ప్రయత్నం జరిగింది. ఇందులో బరీంద్ర ఘోష్, ఉలాస్‌కర్ దత్, ప్రఫుల్లా చాకీ పాల్గొన్నారు.

కలకత్తా ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్

బ్రిటిషర్లపై వ్యతిరేకత

1906లో మిద్నాపూర్‌లో ఒక ఉత్సవం జరిగింది. బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ 'వందేమాతరం’ పేరుతో సత్యేంద్రనాథ్ బోస్ ఒక కరపత్రాన్ని ప్రచురించారు. ఉత్సవంలో ఈ కరపత్రాలను పంచిపెట్టే బాధ్యతను ఖుదీరామ్ బోస్‌కు అప్పగించారు.

బ్రిటీషర్లకు తొత్తుగా ఉన్న రామ్‌చరణ్ సేన్ అనే వ్యక్తి ఖుదీరామ్ ఈ కరపత్రాలను పంచిపెట్టడం చూశాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఒక సిపాయికి చెప్పాడు. ఖుదీరామ్‌ను పట్టుకునేందుకు సిపాయి ప్రయత్నించాడు. ఖుదీరామ్ ఆ పోలీస్ ముఖంపై ఒక పిడిగుద్దు ఇచ్చి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పుడు అక్కడే ఉన్న ఇతర పోలీసులు వారి వద్దకు వచ్చారు. అందరూ కలిసి ఖుదీరామ్‌ను పట్టుకున్నారు.

ఖుదీరామ్ ఆత్మకథలో లక్ష్మేంద్ర చోప్రా ఇలా రాశారు. ''సత్యేంద్రనాథ్ కూడా అదే ఉత్సవంలో తిరుగుతున్నారు. ఆయన సిపాయిలను మందలిస్తూ మన డిప్యూటీ మెజిస్ట్రేట్ కుమారుడిని మీరెందుకు పట్టుకున్నారు? అని అడిగారు. ఆ మాట వినగానే సిపాయిలు గందరగోళానికి గురై ఖుదీరామ్‌పై పట్టు విడిచారు. అదే అదనుగా ఖుదీరామ్ బోస్ అక్కడి నుంచి పారిపోయారు.

తర్వాత పోలీసులను తప్పుదారి పట్టించారనే ఆరోపణలతో సత్యేంద్రనాథ్‌పై 'డీ వెస్టన్’ కోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆయనపై అభియోగాలు రుజువు కాలేదు. డి వెస్టన్ తీర్పు వెలువరిస్తూ 1906 ఏప్రిల్ నుంచి సత్యేంద్రనాథ్‌ను ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు’’ అని ఆత్మకథలో లక్ష్మేంద్ర చోప్రా రాసుకొచ్చారు.

ఖుదీరామ్ బోస్ ఆత్మకథ

తుపాకులతో ముజఫర్‌పుర్ చేరిన ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకీ

1908 ఏప్రిల్ 8వ తేదీన 17 ఏళ్ల ఖుదీరామ్ బోస్‌, ప్రఫుల్లా చాకీలకు డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్‌ను హత్య చేసే బాధ్యతను అప్పగించారు. దీనికంటే ముందు విప్లవకారులు పార్సిల్ బాంబు పంపి కింగ్స్‌ఫోర్డ్‌ను చంపడానికి ప్రయత్నించారు. కానీ, డగ్లస్ ఆ పార్సిల్‌ను తెరవలేదు. మరో ఉద్యోగి దాన్ని తెరుస్తుండగా గాయపడ్డారు.

విప్లవకారుల చర్యలకు భయపడి కింగ్స్‌ఫోర్డ్ బెంగాల్ నుంచి బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు బదిలీ అయ్యారు. యుగాంతకారీ సంఘం తరఫున ఖుదీరామ్‌ రెండు తుపాకులు, ప్రఫుల్లా చాకీ ఒక తుపాకీ తీసుకొని ముజఫర్‌పుర్ చేరుకున్నారు. హేమచంద కానూంగో వారికి కొన్ని హ్యాండ్ గ్రెనెడ్లను ఇచ్చారు.

''1908 ఏప్రిల్ 18న ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకీ తమ మిషన్ కోసం ముజఫర్‌ఫుర్ చేరుకున్నారు. వీర్ మోతీ జీల్ ప్రాంతంలోని ఒక ధర్మశాలలో వారిద్దరూ ఉన్నారు. కింగ్స్‌పోర్డ్ నివాసం, ఆయన దినచర్యల గురించి వారిద్దరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికే పోలీసు డిటెక్టివ్‌లు, కింగ్స్‌ఫోర్డ్ ప్రాణాలకు ప్రమాదం ఉందని గుర్తించారు. వారు కింగ్స్‌ఫోర్డ్‌ను అప్రమత్తం చేసి భద్రతను మరింత పెంచారు’’ అని ఖుదీరామ్ ఆత్మకథలో రాశారు.

కింగ్స్‌ఫోర్డ్ ప్రతీరోజు తన భార్యతో కలిసి స్టేషన్‌ క్లబ్‌కు వస్తారని ఖుదీరామ్, ప్రఫుల్లా గమనించారు.

క్లబ్ నుంచి తిరిగి వస్తుండగా కింగ్స్‌ఫోర్డ్ ప్రయాణిస్తున్న గుర్రపు బగ్గీపై బాంబు విసిరి చంపాలని వారిద్దరూ ప్రణాళిక వేసుకున్నారు.

రాత్రి 8:30 గంటలకు బాంబు పేలుడు

ఆ రోజుల్లో ముజఫర్‌పుర్ స్టేషన్ క్లబ్‌లో సాయంత్రం వేళల్లో చాలా ఉత్సాహంగా గడిపేవారు. అక్కడ ప్రతీ రోజూ సాయంత్రం బ్రిటిష్ అధికారులు, ఉన్నత పదవుల్లో పనిచేసే భారతీయులు కలిసేవారు. పార్టీ చేసుకుంటూ ఇండోర్ గేమ్స్ ఆడేవారు. కానీ, కలకత్తా క్లబ్‌లతో పోలిస్తే ముజఫర్‌పుర్ క్లబ్‌లను రాత్రిపూట తొందరగా మూసివేసేవారు.

ఆ రోజు కింగ్స్‌ఫోర్డ్, బ్రిటిష్ బారిష్టర్ ప్రింగల్ కెనడీ భార్య, కుమార్తెతో కలిసి పేకాట ఆడుతున్నారు. 1908 ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 8:30 గంటలకు ఆట ఆడటం అయిపోగానే కెనడీ భార్య, ఆమె కూతురు గ్రేస్ కెనడీ ఇద్దరూ ఒక గుర్రపు బగ్గీలో తిరుగు పయనం అయ్యారు. ఈ గుర్రపు బగ్గీ దాదాపు కింగ్స్‌ఫోర్డ్ బగ్గీని పోలి ఉంటుంది. ఆ మహిళలు ఇద్దరూ కింగ్స్‌ఫోర్డ్ ఇల్లు ఉండే దారిలోనే వెళుతున్నారు. కింగ్స్‌ఫోర్డ్, అతని భార్య మరో గుర్రపు బగ్గీని ఎక్కారు.

'ద అలీపుర్ బాంబు కేసు’ అనే పుస్తకాన్ని నూరుల్ హోడా రాశారు. ''అది చీకటి రాత్రి. గుర్రపు బగ్గీ కింగ్స్‌ఫోర్డ్ ఇల్లు కాంపౌండ్ తూర్పు గేటును చేరుకోగానే రహదారికి దక్షిణం వైపున దాక్కున్న ఇద్దరు వ్యక్తులు బగ్గీ వైపుకు పరిగెత్తారు. వారు బగ్గీ లోపల బాంబును విసిరేశారు.

బాంబు పేలడంతో బగ్గీ ముక్కలైంది. అందులోని ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. బగ్గీ వెనుక నిల్చున్న దోసాధ్ స్పృహ కోల్పోయారు. గాయపడిన వారిని కింగ్స్‌ఫోర్డ్ ఇంటికి తీసుకొచ్చారు. గాయపడిన గ్రేస్ కెనెడీ గంటలోపే మరణించగా కెనెడీ భార్య 24 గంటల పాటు మరణంతో పోరాడి మే 2వ తేదీన కన్నుమూశారు’’ అని పుస్తకంలో రాశారు.

ద అలీపొరి బాంబ్ కేస్ పుస్తకం

బోస్, చాకీపై రూ. 5000 రివార్డు

ఈ ఘటనను రికార్డుల్లో నమోదు చేశారు. ''బాంబు పేలుడు తీవ్రత ఎక్కువగా లేదు. కానీ, హంతకులు బాంబును గురి చూసి సరైన ప్రదేశంలో విసిరారు. హంతకులు లక్ష్యానికి కనీసం ఒక అడుగు దూరంలో బాంబు విసిరినా ఇద్దరు మహిళల్లో కనీసం ఒకరైనా బతికి ఉండేవారు’’ అని ఘటన గురించి రికార్డుల్లో రాశారు.

కింగ్స్‌పోర్డ్ హత్యకు గురికావొచ్చని హెచ్చరికల నేపథ్యంలో కలకత్తా పోలీసులు ఆయనకు భద్రతగా ఇద్దరు పోలీసులు తహసీల్దార్ ఖాన్, ఫయాజుద్దీన్‌లను ఏర్పాటు చేశారు.

ఏప్రిల్ 30వ తేదీన ఈ ఇద్దరు పోలీసులకు స్టేషన్ క్లబ్ నుంచి కింగ్స్‌ఫోర్డ్ నివాసానికి మధ్య పెట్రోలింగ్ బాధ్యతలను అప్పగించారు. రాత్రి 8:30 గంటలకు ఆ పోలీసులు, కింగ్స్‌ఫోర్డ్ ఇంటి బయట బాంబు చప్పుడును విన్నారు. అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులు దక్షిణం వైపు పారిపోవడం చూశారు. కానీ, వారు చీకటిలో తప్పించుకున్నారు.

ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకీ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కానీ, తొందరపాటులో ఖుదీరామ్ బోస్ బూట్లు అక్కడే వదిలేసి వెళ్లారు.

ఈ ఘటన జరిగిన తర్వాత జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ముజఫర్‌పుర్ నుంచి మోకామా, బంకీపూర్ దిశలో అనేక మంది పోలీసులను మోహరించారు. వీరి ఆచూకీ చెప్పిన వారికి రూ. 5000 రివార్డు అందజేస్తామని పోలీసు యంత్రాంగం ప్రకటించింది.

ఖుదీరామ్ బోస్

ఖుదీరామ్ బోస్ అరెస్ట్

ఈ ఘటనతో ముజఫర్‌పుర్ నగరం ఉద్రిక్తంగా మారింది. ఖుదీరామ్, చాకీ రైలు పట్టాల వెంట పరిగెడుతూ సమస్తీపుర్‌ సమీపంలోని వైనీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారు చీకటిలో దాదాపు 24 మైళ్ల దూరం కాలినడకన వెళ్లారు. వైనీ స్టేషన్‌కు చేరుకోగానే ఒకరినొకరు హత్తుకున్న వీరిద్దరూ తర్వాత వేర్వేరు మార్గాల్లో వెళ్లిపోయారు. ఒకవేళ ప్రాణాలతో ఉంటే కలకత్తాలో కలుసుకోవాలని వారిద్దరూ నిశ్చయించుకున్నారు.

''1908 మే 1వ తేదీన ఉదయం వైనీ రైల్వే స్టేషన్ సమీపంలో కిశోర్ ఖుదీరామ్ నీరు తాగుతూ విశ్రాంతి తీసుకుంటుండగా చుట్టుపక్కల వారి మాటలు ఆయన చెవిన పడ్డాయి. రాత్రి జరిగిన ఘటన గురించి వారు చర్చించుకుంటున్నారు. అందులో ఒకరు కింగ్స్‌ఫోర్డ్ చనిపోలేదు, కానీ బ్రిటీష్ తల్లీకూతుర్లు ఇద్దరూ చనిపోయారు అని అన్నారు.

ఆ మాటలు విన్నాక ఖుదీరామ్ షాక్ అయ్యారు. 'అంటే కింగ్స్‌పోర్డ్ చనిపోలేదా?’ అని ఖుదీరామ్ అసంకల్పితంగానే అన్నారు. అక్కడే కొందరు బ్రిటిష్ కానిస్టేబుళ్లు, గూఢాచారులు కూడా తిరుగుతున్నారు. ఖుదీరామ్ అలసట, ఉద్వేగం, వయస్సుతో పాటు బెంగాలీ భాష మాట్లాడే తీరు, కాళ్లకు చెప్పులు లేకుండా ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆయనను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయనను పట్టుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు జేబులో నుంచి రివాల్వర్ కింద పడింది. వెంటనే కాల్పులు జరపాలనే ఉద్దేశంతో ఖుదీరామ్ మరో చిన్న రివాల్వర్‌ను బయటకు తీశారు. అప్పుడు ఆయన జేబు నుంచి 37 కాట్రిడ్జ్‌లు, 30 రూపాయలు బయటపడ్డాయి’’ అని లక్ష్మేంద్ర చోప్రా రాసుకొచ్చారు.

అరెస్ట్ సమయంలో ఖుదీరామ్ బోస్

పాదాలకు బూట్లు తొడిగి మరీ చూశారు

లక్ష్మేంద్ర చోప్రా ఇంకా ఏం రాశారంటే.. ''ఖుదీరామ్ నడుముకు ఒక చారల కోటు చుట్టి ఉంది. క్లబ్ ప్రాంగణం బయట ఖుదీరామ్ ఆ చారల కోటును ధరించినట్లు తర్వాత తహసీల్దార్ ఖాన్ గుర్తించారు. బోస్ అరెస్ట్ వార్త విన్న తర్వాత ఆయనను తీసుకెళ్లేందుకు జిల్లా మెజిస్ట్రేట్, వైనీ స్టేషన్‌కు వచ్చారు. తర్వాత ఖుదీరామ్ బోస్‌ను తహసీల్దార్ ఖాన్, ఫయాజుద్దీన్ గుర్తు పట్టారు. క్లబ్ ముందు తమకు కనిపించిన ఇద్దరిలో ఈయన కూడా ఒకరని వారిద్దరూ సాక్ష్యం చెప్పారు’’ అని పుస్తకంలో రాశారు.

ఘటనా స్థలంలో దొరికిన బూట్లను ఖుదీరామ్ పాదాలకు వేసి చూశారు. ఆయన పాదాలకు ఆ బూట్లు సరిగ్గా సరిపోయాయి. పైగా ఆ బూట్లు తనవే అని ఖుదీరామ్ స్వయంగా ఒప్పుకున్నారు.

అయితే పోలీసు దర్యాప్తులో తన సహచరుని అసలు పేరును ఖుదీరామ్ వెల్లడించలేదు. అతని సహచరుని పేరును దినేశ్ చంద్ర రాయ్ అని అబద్ధం చెప్పారు.

కింగ్స్‌ఫోర్డ్ బగ్గీని గుర్తించడంలో తాను తప్పు చేశానని ఖుదీరామ్ ఒప్పుకున్నారు. పోలీసుల చేతిలో ఖుదీరామ్ బందీగా ముజఫర్‌పుర్ చేరుకున్నప్పుడు ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

ప్రఫుల్లా చాకీ

ప్రఫుల్లా ఆత్మహత్య

మే1వ తేదీన సాయంత్రం 6 గంటలకు సబ్ ఇన్‌స్పెక్టర్ నందలాల్ బెనర్జీ, సింగభూమ్ వెళ్లే రైలు ఎక్కారు. సమస్తీపూర్ స్టేషన్‌లో ప్లాట్‌పామ్‌పై కొత్త దుస్తులు, బూట్లు ధరిస్తున్న ఒక బెంగాలీ యువకుడిని నందలాల్ చూశారు. ఆ యువకునిపై నందలాల్‌కు అనుమానం కలిగింది.

ఆ యువకుడు కూర్చొన్న కంపార్ట్‌మెంట్‌లోకి నందలాల్ వెళ్లారు. అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ యువకుడు కోపంగా మరో కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాడు. మొకామా ఘాట్ స్టేషన్‌లో నందలాల్ మళ్లీ ఆ యువకుడు కూర్చున్న కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చారు.

ప్రఫుల్లా చాకీ రైలు టికెట్

అంతకంటే ముందే ఆ యువకుని గురించి ముజఫర్‌పుర్ పోలీసులకు నందలాల్ టెలిగ్రాఫ్ చేశారు. అనుమానితుడిగా ఆ యువకుడిని అదుపులోకి తీసుకోవాలంటూ నందలాల్‌కు తిరుగు టెలిగ్రాఫ్ వచ్చింది. తాను దొరికిపోయినట్లు తెలియగానే ఆ యువకుడు వెంటనే ప్లాట్‌ఫామ్‌పైకి దూకి పరుగెత్తాడు.

నూరుల్ హుడా ఈ ఘటన గురించి ప్రస్తావించారు. ''ఆ యువకుడు మహిళల విశ్రాంతి గది వైపు పరుగెత్తాడు. అక్కడ ఒక జీఆర్పీ జవాన్ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఆ యువకుడు పిస్టల్‌ తీసుకొని జవాన్ వైపు కాల్పులు జరిపాడు. కానీ అతని గురి తప్పింది. తర్వాత ఆందోళన చెందిన అతను రెండు సార్లు తనను తానే కాల్చుకున్నాడు. ఒక బుల్లెట్ భుజం గుండా, మరొకటి గొంతులో తగలడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు’’ అని రాశారు.

ప్రఫుల్లా చంద్ర చాకీ స్టాంపు

ఉరి శిక్ష

ప్రఫుల్లా చాకీ మృతదేహాన్ని ముజఫర్‌పుర్‌కు తరలించారు. అక్కడ తహసీల్దార్ ఖాన్, ఫయాజుద్దీన్‌లు ప్రఫుల్‌ను గుర్తించారు. ఖుదీరామ్ బోస్‌తో కలిసి క్లబ్ ప్రాంగణంలో తిరిగిన వ్యక్తి ఇతనే అని చెప్పారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో ప్రఫుల్ చాకీ మృతదేహాన్ని ఖుదీరామ్ బోస్‌కు చూపించారు.

ఖుదీరామ్ బోస్ తన సహచరుడి మృతదేహాన్ని గుర్తించాడు. కానీ అతని పేరును దినేశ్ చంద్ర రాయ్ అనే చెప్పాడు. చాకీ వాడిన పిస్టల్‌ను చూపించగా ఖుదీరామ్ దాన్ని గుర్తించలేకపోయాడు. కానీ తన వద్ద పిస్టల్ ఉందని దినేశ్ తనతో చెప్పాడని ఖుదీరామ్ పోలీసులకు వెల్లడించాడు.

ఈ ఘటన జరిగిన అయిదు నెలల తర్వాత, 1908 నవంబర్ 9న ప్రఫుల్లా చాకీని అరెస్ట్ చేసిన నందలాల్ బెనర్జీని కలకత్తాలో శ్రీశ్చంద్రపాల్, గణేంద్రనాథ్ గంగూలీ కాల్చి చంపారు.

హత్య కేసు ఆరోపణలతో ఖుదీరామ్ బోస్‌ను అడిషనల్ సెషన్స్ జడ్జి హెచ్. డబ్స్ కార్న్‌డఫ్ విచారించారు. ఖుదీరామ్‌ను కోర్టుకు తీసుకు వస్తుండగా రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న ప్రజలు... జిందాబాద్, వందేమాతరం నినాదాలతో స్వాగతం పలికారు. 1908న జూన్ 13న ఖుదీరామ్ బోస్‌కు కోర్టు మరణశిక్ష విధించింది.

ఖుదీరామ్ బోస్

శోకసంద్రంలో దేశం

1908 ఆగస్టు 11వ తేదీ ఉదయం 6 గంటలకు భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో తొలిసారిగా ఒక బాల నేరస్థుడిని ఉరి తీశారు. ఆ సమయంలో అతని వయస్సు 18 సంవత్సరాల 8 నెలలు. ఉరి తీసే సమయంలో ఆయన చేతిలో ఒక కాగితం ఉంది. ఆయనకు వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున వచ్చిన జనం జైలు బయట వందేమాతరం గీతం ఆలపించారు.

ఖుదీరామ్ బోస్ బలిదానంపై లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అనేక వ్యాసాలు రాశారు.

దేశవ్యాప్తంగా ఖుదీరామ్ పొటోలను పంచి పెట్టారు. సాహితీవేత్త బాలకృష్ణ భట్ తన ఉపన్యాసాలలో ఖుదీరామ్ బోస్‌కు నివాళులు అర్పించినందుకు గానూ తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మున్షీ ప్రేమ్‌చంద్ తన స్టడీ రూమ్ గోడపై ఖుదీరామ్ బోస్ ఫొటోను పెట్టుకున్నారు.

ఖుదీరామ్ బోస్ బలిదానం ముఖ్యంగా విద్యార్థులపై ప్రభావం చూపింది. విద్యార్థుల్లో వందేమాతరం, 'ఆనందమఠం' చదవాలనే ఆసక్తి పెరిగిపోయింది.

ఖుదీరామ్ గౌరవార్థం బెంగాల్ కళాకారులు ఒక ప్రత్యేక ధోతిని నేయడం ప్రారంభించారు. దానిపై 'ఖుదీరామ్’ అనే అక్షరాలను రాశారు.

ఖుదీరామ్‌పై పీతాంబర్ దాస్ '' ఏక్ బార్ బిదాయే దే మా ఘూరే ఆషి (ఒకసారి నాకు వీడ్కోలు ఇవ్వు అమ్మా, నేను తిరిగి మళ్లీ వస్తాను)’’ అనే పాట రాశారు. ఈ పాట ఇప్పటికీ బెంగాల్‌లోని ప్రతీ ఇంట్లో వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Khudiram Bose: A warrior who was hanged at the age of 18
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X