కిషన్ రెడ్డి: ఆ ఓటమి మంచే చేసింది, ఏకంగా కేంద్రమంత్రిగా, ఈ సారి ప్రమోషన్
కిషన్ రెడ్డి.. అంచెలు అంచెలుగా ఎదిగిన నేత. జనతాపార్టీలో చేరి.. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. యువమోర్చాలో కీలక పదవులు చేపట్టారు. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు. మోడీ 2.0 మంత్రివర్గంలో సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ప్రమోషన్ దక్కనుంది. స్వతంత్ర హోదాతో మంత్రి పదవీ లభించే ఛాన్స్ ఉంది. స్వతంత్ర హోదాతో కార్మికశాఖ ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో బండారు దత్తాత్రేయ ఇదే పదవీ చేపట్టినందున.. కిషన్ రెడ్డికి కూడా అదే పోర్టు పోలియో ఇస్తారని సమాచారం. కిషన్ రెడ్డికి ప్రమోషన్ వస్తున్నందున ఆయన రాజకీయ జీవితాన్ని ఓ సారి పరిశీలిద్దాం.

జనతా పార్టీ నుంచి ప్రస్థానం..
1964, మే 15న జి స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు కిషన్ రెడ్డి జన్మించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం వారి స్వస్థలం. టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తిచేశారు. 1995లో కావ్యతో కిషన్ రెడ్డి వివాహం కాగా.. వీరికి ఇద్దరు సంతానం వైష్ణవి, తన్మయ్ ఉన్నారు. రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. 1977లో జనతాపార్టీలో కిషన్ రెడ్డి చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో చేరిపోయారు. 1980లో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవీ చేపట్టారు. 1983లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను అధిష్టించారు. 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులు చేపట్టారు.

అసెంబ్లీకి ఇలా..
2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గం మారింది. అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా 2010, మార్చి 6న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం విజయం సాధించారు. 2014లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

ఓడిపోవడంతో లోక్‌సభకు పోటీ.. విజయం
2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గంలో ప్రధాని మోడీ ఆయనకు స్థానం కల్పించారు. ప్రస్తుతం హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిషన్ రెడ్డికి స్నేహితుడు.. అందుకే ఛాన్స్ ఇచ్చారని అంటుంటారు. ఈ సారి ప్రమోషన్ కల్పించి.. మంత్రి పదవీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications