KK Survey: మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఎందుకు గెలిచిందో చెప్పిన కేకే సర్వే..
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలున్న మరాఠ రాష్ట్రంలో మహాయుతి కూటమి 230 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఇందులో బీజేపీ 132 సీట్లు, శివసేన 57 స్థానాలు, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించాయి. ఇకా కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కేవలం 46 సీట్లకే పరిమితమైంది. ఇందులో శివసేన యూబీటీ 20 స్థానాలు, కాంగ్రెస్ 16 చోట్ల, ఎన్సీపీఎస్పీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు 13 చోట్లు విజయం సాధించారు.
అయితే మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన కేకే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి. మరాఠ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఎలా ప్రచారం చేశాయో కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్ వివరించారు. మహారాష్ట్రలో నవంబర్ 1 వరకు హోరాహోరీగా పోటీ ఉందని చెప్పారు. మహాయుతి, మహా వికాస్ అఘాడి మధ్య పోటీ నువ్వ నేనా అన్నట్లుగా ఉండేదని.. ఆ తర్వాత క్రమంగా పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చిందని వివరించారు.

బీజేపీ మంచి ప్లాన్ ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఎక్కడ ఎవరికి బలముంటే వారికి సీటు ఇచ్చినట్లు తెలిపారు. శివసేన బలంగా ఉన్న చోట శివసేనకు.. ఎన్సీపీ బలంగా ఉన్న స్థానంలో ఎన్సీపీకి టికెట్లు ఇచ్చిందని చెప్పారు. అలాగే బీజేపీ బలం ఉన్న చోట ఆ పార్టీ పోటీ చేసినట్లు వివరించారు. కానీ మహా వికాస్ అఘాడి కూటమిలో అలా జరగలేదన్నారు. పలు సీట్లలో ఓ పార్టీకి బలం ఉంటే మరో పార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల దెబ్బ పడిందని పేర్కొన్నారు. ప్రచారంలో కూడా మహా వికాస్ అఘాడి అభ్యర్థులు వెనకపడినట్లు వివరించారు.
సోషల్ మీడియాలో ఎన్డీఏ కూటమి దూసుకెళ్లినట్లు వివరించారు. మహారాష్ట్రలో సర్వే చేయడం సింపుల్ కాదని వివరించారు. అక్కడ రిజియన్లు ఉంటాయని గుర్తు చేశారు. అంతేకాకుండా దేశ నలు మూలల నుంచి వచ్చే అక్కడ స్థిరపడిన వారు చాలా మందే ఉన్నారని చెప్పారు. సర్వే కోసం చాలా కష్టపడినట్లు వివరించారు. కాగా ఏపీ ఎన్నికల సందర్భంగా కేకే చేసిన సర్వే ప్రకారం ఫలితాలు వచ్చాయి. కానీ హర్యానాలో మాత్రం అటు ఇటుగా ఫలితాలు వచ్చాయని కొండేటి కిరణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications