కోల్ కతా తొక్కిసలాట ఘటన.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మృతుల కుటుంబాలకు..
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై బెంగాల్ సీఎం సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 25 లక్షల పరిహారం అందించారు.
అలాగే కుటుంబంలోని ఒకరికి గ్రూప్- D స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి పూర్తి వైద్య ఖర్చులు తమ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అంతేకాక తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు కలకత్తా హైకోర్టుకు చెందిన సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గా పూజా మండపం నిర్వాహక కమిటీ సభ్యులతో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోల్ కతాలో మూడు రోజులపాటు అంటే అక్టోబర్ 18 నుంచి 20 వరకు సెక్షన్ 163 అమలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 14 మందిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సువేంధు అధికారితో కలిసి ఆస్పత్రికి చేరుకున్న ఆయన అక్కడి వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు బెంగాల్ గవర్నర్ ఆర్ ఎన్ రవి సైతం బెంగాల్ తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.












Click it and Unblock the Notifications
