ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి MGNREGA వర్కర్స్ మృతి.. పలువురికి సీరియస్
నవరాత్రి ఉత్సవాల వేళ పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా లెహ్రాగాగా- జఖార్ రోడ్డు వద్ద ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి MGNREGA కార్మికుల పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగే సమయానికి దాదాపు 25 మంది కార్మికులు రోడ్డు వెంట పనులు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఈ ఘటనలో అనేకమందికి గాయాలైనట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని కరమ్ జిత్ కౌర్, జీవన్ సింగ్, నిక్కి, సరబ్ జిత్ కౌర్, రాజ్ నీత్ కౌర్, దేశ్ రాజ్ లుగా గుర్తించారు. మృతులంతా సంగ్రూర్ జిల్లాలోని అలీషేర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై సంగ్రూర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ పల్వీందర్ చీమా మాట్లాడుతూ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు చెవ్రోలెట్ పంజాబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను కలిగి ఉందని పేర్కొన్నారు. డ్రైవర్ ను పర్గత్ సింగ్ గా గుర్తించామని అతను రాయ్ ధరనా గ్రామానికి చెందినట్లు తేలిందన్నారు.

ఇక ఈ రోడ్డు ప్రమాదంపై పంజాబ్ కేబినెట్ మంత్రి బరీంద్ర కుమార్ గోయల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే రోజు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి 1:30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ఓ ట్రక్కు అదుపులోకి షీత్లా మాతా ఆలయంలోకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 14 మంది భక్తులు మృతి చెందారు. మరో 30 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గ్వాలియర్ ఎస్పీ ధరమ్ వీర్ సింగ్ వెల్లడించారు. నవరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారని ఈ సమయంలోనే ఇలాంటి ఘటన జరిగిందని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
