హౌతీ దాడుల వేళ సౌదీలోని భారత పౌరులకు.. ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ..
హౌతీ దళాల దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని భారత పౌరులకు సౌదీలోని భారత రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రానున్న కాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం ఉందని ఈ మేరకు భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏదైనా వైమానిక దాడులు జరిగితే తక్షణమే సమీప ప్రాంతాలకు తరలివెళ్లాలని ఓ భవంతిలోకి లేదా కిటికీలకు దూరంగా ఓ ఇంటీరియర్ రూమ్ లోకి వెళ్లాలని స్పష్టం చేసింది. అలాగే ఈ దాడులకు సంబంధించి ఫిల్మింగ్, పబ్లిషింగ్, ఏదైనా సమాచారాన్ని షేర్ చేయడం, ఫొటోలు, వీడియోలను చిత్రీకరించడం లాంటి వాటికి దూరంగా ఉండాలని సౌదీలోని భారత దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది.
ఇటీవల అక్టోబర్ 10న సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో సెక్యూరిటీని మరింత పెంచిన క్రమంలో ఈ మేరకు సౌదీలోని భారత పౌరులకు అక్కడి భారతీయ దౌత్య కార్యాలయం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 10 న జరిగిన ఈ దాడిలో ఓ భారతీయుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఇక ఈ దాడుల్లో గాయపడిన భారతీయులకు సరైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందుతోందని వారి కుటుంబ సభ్యులతో భారత దౌత్య కార్యాలయం ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుందని వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని స్పష్టం చేసింది. అలాగే రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రస్తుతం మూసి ఉందని అయితే దమ్మన్, జెడ్డా, మెదినా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లు మాత్రం తెరిచే ఉంటాయని పేర్కొంది. అలాగే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఇండిగో విమాన సంస్థలకు చెందిన విమాన సేవలు సౌదీలోని అన్ని ప్రాంతాలకు అక్టోబర్ 24 వరకు నిషేధించబడినట్లు పేర్కొంది. అలాగే భారత్ నుంచి అత్యవసరంగా వెళ్లేవారు బహ్రెయిన్, కువైట్ లేదా ఖతార్ మార్గాలను ఎంచుకోవాలని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
