• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కొటియా గ్రామాలు
Click here to see the BBC interactive

ఒక ఓటరు...ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం. అలా వేస్తే ఆ రెండు ఓట్లూ చెల్లవు.

కానీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న 21 గ్రామాలకు చెందిన దాదాపు 4 వేల మంది ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తారు. అది ఒక రాష్ట్రంలో కాదు.... రెండు రాష్ట్రాల్లో.

అలా ఓట్లు వేయడం కోసమే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండూ రాష్ట్రాలు వీరికి పోటీ పడి ఓటు హక్కుతో పాటు అనేక పథకాలు అందిస్తున్నాయి.

దీంతో ఇక్కడ గిరిజనులకు రెండు రేషన్ కార్డులు, రెండు పింఛన్ కార్డులు, రెండు ఓటరు కార్డులు...ఇలా అన్నీ రెండేసి ఉంటాయి. అలాగే రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను వీరు ఎన్నుకుంటారు.

ఈ గ్రామాల కథేంటి? వీటిపై రెండు రాష్ట్రాలకూ ఇంత ప్రేమ దేనికి? వీటిని తెలుసుకునేందుకు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల్లో బీబీసీ పర్యటించింది.

ఒకే కుటుంబానికి రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు

సర్వేతో మొదలైన సమస్య...

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్ ప్రాంతంలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు.

ఇక్కడ దాదాపు 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,902 మంది ఓటర్లు. వీరు ఇటు ఆంధ్రాలోనూ, అటు ఒడిశాలో ఓటు హక్కును కలిగి ఉంటారు.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామాలు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.

అప్పటి నుంచి ముందుకు కదలని కొటియా కేసుపై 2000లో సుప్రీం కోర్టు ఓ ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం కొటియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని వేసింది. అందులో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, న్యాయవాదులు ఉన్నారు.

కొటియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, కోర్టులో వాదనలు చేసింది. అయినా విషయం కొలిక్కి రాలేదు. తర్వాత 2006లో ఈ సమస్యని పార్లమెంటులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.

ఇప్పటికీ ఈ పంచాయితీ తేలలేదు.

కొటియా గ్రామాలుగా ఉన్న 21 గ్రామలు...మరికొన్ని గ్రామాలుగా విడిపోయి వాటి సంఖ్య ప్రస్తుతం 34కి చేరిందని కొటియా కమిటీలో ఏపీ తరపున స్పెషల్ కౌన్సిల్‌గా పని చేసిన విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది ఎస్ఎస్ఎస్ఎస్ రాజు బీబీసీతో చెప్పారు.

"1942లో పరిపాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. దానికోసం 1942లో సర్వే జరిపించింది. ఆ క్రమంలో ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించేందుకు గిల్. జి అనే సర్వే అండ్ ల్యాండ్ రికార్డు కార్యాలయ అధికారి సర్వే నిర్వహించారు. ఇందులో ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని ఇరు రాష్ట్రాల్లో విలీనం చేయగా... కొటియా పంచాయతీ పరిధిలో 21 గ్రూపు గ్రామాల సంగతి తేల్చలేదు. అప్పట్నుంచి ఈ గ్రామాలు తమవంటే తమవని ఒడిశా, ఆంధ్రా పట్టుబడుతున్నాయి. ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే... కోర్టు స్టేటస్ కో విధించింది. దీంతో ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. అసలు కొటియా గ్రామాల సమస్యపై అవగాహన ఉన్నవారు కూడా లేరు. ఏపీ తరపున ఈ సమస్యపై పని చేసిన ఆర్జేడీ చనిపోయారు. కాకినాడకు చెందిన మరో సర్వేయర్ చలపతిరావు రిటైర్డ్ అయిపోయారు. ప్రస్తుతానికి ఈ సమస్యపై అవగాహన ఉండి పని చేసిన వారిలో నేను, చలపతిరావు మాత్రమే ఉన్నాం" అని ఆయన తెలిపారు.

ఒడిశా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్

పథకాలు ఆంధ్రా...పనులు ఒడిశా...

ప్రస్తుతం ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరగుతున్న తరుణంలో కొటియా గిరిజనులు కూడా ఓటేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక్కడి గిరిజనులు రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఓటేస్తారు.

గత ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా స్థానిక ఎన్నికల్లో ఓటేసిన ఈ గిరిజనం.. ఇప్పుడు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటామని అంటున్నారు.

కొటియా, కురిటిభద్ర, మడకార్, డోలియాంబ తదితర గ్రామలు ఒడిశాకు.... నేరేళ్లవలస, ఎగువశెంబి, దిగువశెంబి, ధూళిభద్ర, మూలతాడివలస, పగులు చెన్నేరు, పట్టుచెన్నేరులు, సొలిపిగుడ, శిఖపరువు గ్రామాలు ఏపీ భూభాగానికి సమీపంలో ఉంటాయి. మిగతావి రెండు సరిహద్దులకి దాదాపు సమాన దూరంలో ఉంటాయి.

దీంతో ఏ రాష్ట్రానికి సమీపంగా ఉన్న గ్రామాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులో ఒడిశా రాష్ట్రానిదే పైచేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే రోడ్లు వేయడంతో పాటు అనేక కార్యాలయాలు ఆ రాష్ట్రం నిర్మిస్తోంది.

ఎక్కడ చూసినా ఒడిశా కార్యాలయాలు, ఒరియా భాషలోని బోర్డులే కనిపిస్తున్నాయి తప్పా...తెలుగు భాషలో అరుదుగా బోర్డులు కనిపిస్తాయి. అయితే రెండు రాష్ట్రాల ఫలాలను అందుకుంటున్న కొటియా గ్రామాల గిరిజనం అభివృద్ధి కోసం ఒడిశా ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటున్నారు.

"మమ్మల్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చూసుకుంటున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం పథకాల ద్వారా మాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం ద్వారా తక్కువ వస్తున్నాయి. కానీ ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేయించింది. గత ఏడాది వరకు మా గ్రామాలకు ఎక్కడికి వెళ్లాలన్నా రాళ్లు రప్పులు తేలిన దారుల్లోనే వెళ్లేవాళ్లం. ఇప్పుడు కొత్త తారు రోడ్లపై వెళ్తున్నాం. అలాగే ఒడిశా మాకు ఇళ్లు కూడా కట్టించింది. మాకు రెండు ప్రభుత్వాలు కావాలి. రెండు ప్రభుత్వాలు అందించే పథకాలు కావాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయిస్తే...వాళ్లు ఏ రాష్ట్రంలో ఉండమంటే అక్కడే ఉంటాం. అప్పటి వరకూ మాత్రం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మేం ఓటేస్తాం" అని కొటియా గ్రామాల్లో ఒకటైన పట్టుచెన్నూరు నివాసి బుట్రూ బీబీసీతో చెప్పారు.

ఒడిశా వేసిన రోడ్లు

వివాదస్పద కొటియాలో రాజకీయాలు

ఇప్పటివరకు రెండు రాష్ట్రాల సమస్యగా ప్రభుత్వాల మధ్య నలుగుతున్న సమస్యలోకి రాజకీయాలు చేరాయి. ఎన్నికల సమయం కావడంతో రాజకీయ నాయకులు ఈ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు.

కొటియా గ్రామాల్లో ఒడిశా బీజేపీ నాయకులు పర్యటనలు చేస్తున్నారు. ఆంధ్రా ప్రభుత్వం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని కొటియా వాసులకి ఒడిశా బీజేపీ నాయకత్వం సూచించింది. అలాగే అయా ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసింది.

అదే ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన బీబీసీతో బీజేపీ ఒడిశా శాఖ ఉపాధ్యక్షుడు భృగి భక్షిపాత్ర్ ప్రత్యేకంగా మాట్లాడారు.

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనది కాని ప్రాంతంపై పట్టుసాధించేందుకు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పుటికే ఒడిశా సరిహద్దులోని అనేక ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ఆక్రమించుకుంది. ఇది పూర్తిగా ఒడిశా ఇంటిలిజెన్స్ విభాగం వైఫల్యం. ఒడిశా ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి... కేంద్రంతో మాట్లాడి భూభాగాన్ని కాపాడుకోవాలి. ఇప్పటీకే ఒడిశా సుప్రీంకోర్టులో కేసు వేసిందని తెలిసింది. ఈ ప్రాంతాలను ఒడిశా సాధించేవరకు పోరాటం ఆపకూడదు. దీనికి బీజేపీ పూర్తిగా సహకరిస్తుంది" అని చెప్పారు.

మరో వైపు కొటియా పంచాయతీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలను ఆపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 10వ తేదిన (2021) హైకోర్టులో పిల్‌ నమోదైంది. భారత్‌ బికాస్‌ పరిషత్‌ అనే స్వంచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ పిల్ వేశారు.

ఒడిశాకు చెందిన బీజేపీ నాయకులు

కొటియాపై ప్రేమకు ఖనిజాలే కారణమా...?

కేసులు, క్షేత్రస్థాయి పర్యటనలు, రాజకీయాలు ఎలా ఉన్నా... అసలు ఈ ప్రాంతంపై ఇరు రాష్ట్రాలకు ఇంత ప్రేమ ఎందుకు?

గిరి శిఖర ప్రాంతంలో ఎవ్వరికి పట్టనట్లు ఉండే ఈ కొటియా గ్రామాల్లో వందల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు పోటీపడి మరీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేస్తున్నాయి?

ఈ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయని...వాటిని దక్కించుకోవాంటే ముందుగా ఇక్కడి గిరిజనుల మనస్సుని గెల్చుకోవాలని... అందుకే ప్రభుత్వాలు పోటీపడి మరి పథకాలు ఇస్తూ పనులు చేస్తున్నాయని వామపక్షనాయకులు అంటున్నారు.

''ఇక్కడ చాలా రోజులుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో సాకుతో కొండలు తవ్వడం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇక్కడ రహస్యంగా ఖనిజ అన్వేషణ జరుగుతుందనే అనిపిస్తుంది. అయితే ఏదో ఒక రూపంలో ప్రజలకు మంచి జరగడం శుభపరిణామమే...కాకపోతే ఈ వివాదాన్ని త్వరగా తేల్చుకోకపోతే...ప్రస్తుతానికి గిరిజనులకి బాగున్నా...భవిష్యత్తులో సమ్యలు వచ్చే అవకాశం ఉంది’’ అని స్థానిక వామపక్ష నాయకులు కిల్లి సురేశ్ బీబీసీతో చెప్పారు.

కొటియా గ్రామాల పరిధిలో ఖనిజ సంపద అనే మాట అందరి నోటా వినిపిస్తూనే ఉంది. అసలు నిజంగా ఇక్కడ ఖనిజాలు ఉన్నాయా అనే విషయంపై ఏయూ జియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటేశ్వరావుతో బీబీసీ మాట్లాడింది.

"తూర్పు కనుమల్లో చాలా చోట్ల ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా బాక్సైట్ వంటి ఖనిజాలు విస్తరంగా ఉన్నాయి. మనం ఒప్పుకున్నా...లేకున్నా...ఖనిజాలను తవ్వడానికి ఏ ప్రభుత్వమూ సంకోచించదు. విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను తమ పరిధిలోకి తెచ్చుకోవాలనే చూస్తాయి. కొటియా గ్రామాల పరిధిలోని కొండల్లో కూడా విలువైన ఖనిజాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తూర్పు కనుమల్లోని ఈ బెల్ట్‌లో మాంగనీసు, ఇనుము, లైమ్ కంకర, క్వార్జ్, గ్రానెైట్, రంగురాళ్లు వంటి ఖనిజ సంపద ఉంది. వీటితో పాటు జల, జంతు సంపద కూడా అపారం. వీటిని కాపాడుకోవాలి. అసలు తూర్పు కనుమల్ని బయోడైవర్సీటి హాట్ స్పాట్‌గా గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని ప్రొఫెసర్ వెంకటేశ్వరావు చెప్పారు.

రెండు రాష్ట్రాలు ఇచ్చిన డోర్ నెంబర్లు

'ఏపీ వేసిన రోడ్లపైనే ఒడిశా రోడ్లు వేస్తోంది’

మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి నేటి వరకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి భౌగోళికంగా ఎన్నెన్నో మార్పులొచ్చాయి. కానీ కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనే వివాదం మాత్రం ఇంకా తేలలేదు.

ఏపీ ప్రభుత్వం కొటియా గ్రామాల విషయంలో పోరాటం చేయడం లేదని...అలాగే అక్కడ ఏపీ ముద్రవేసే కార్యక్రమాలు ఎక్కువగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటి గురించి స్థానిక ఎమ్మేల్యే రాజన్నదొరతో బీబీసీ మాట్లాడింది.

"వివాదస్పద కొటియా గ్రామాలు విజయనగరం జిల్లా సాలూరు మండలంలోకి కొటియా ప్రాంతాలు వస్తాయి. బ్రిటిష్ హయంలో ఈ ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేవి. అప్పట్లోనే ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతాలు తమవని వాదించేది. అయితే దీనిని మద్రాస్ ప్రెడిడెన్సీ ఖండిస్తూ ఉండేది. బ్రిటిష్ హయాం నుంచి ఈ గ్రామాలను సాలూరు మండల పరిధి భూభాగంలో చూపించారు. 1942లో జరిగిన గిల్ సర్వే ప్రకారం కూడా అదే వర్తిస్తుంది. గతంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి కొటియా గ్రామాల సమస్యను తీసుకువెళ్లాం. ఇరు రాష్ట్రాలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాం. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు నిర్వహించవద్దని బీజేపీతో పాటు ఒడిశాలోని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ అక్కడ ఏపీ ప్రభుత్వం తరపున ఎన్నికలు జరగడం ఇదేమి కొత్త కాదు. నేను పుట్టక ముందు నుంచి ఆ ప్రాంతంలో ఏపీ గవర్నమెంట్ ఎన్నికలు నిర్వహిస్తోంది. దీనికి సుప్రీం కోర్టు లేదా పార్లమెంట్ పరిష్కారం చూపాలి. ఒడిశా మేం అభివృద్ధి చేశామని చెప్పుకోవడం కోసం....ఏపీ ప్రభుత్వం వేసిన రోడ్లపై మళ్లీ రోడ్లు వేసి మేమే వేశాం అని చెప్పుకుంటోంది. నిజానికి అక్కడున్న అపారమైన ఖనిజ సంపదను కొల్లకొట్టేందుకే ఒడిశా ఈ డ్రామాలు ఆడుతోంది" అని సాలూరు ఎమ్మేల్యే పీడిక రాజన్నదొర బీబీసీతో చెప్పారు.

రోడ్డు

'కొండల్లో అభివృద్ధి కనిపిస్తోంది’

ఏపీ, ఒడిశా రెండు రాష్ట్రాలు కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాయి. అయితే ఏపీ కంటే ఒడిశాయే ముందంజలో ఉంది.

కొటియా గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు రూ.180 కోట్లను మంజూరు చేసింది. అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకునే గిరిజన ఉత్సవాలకు, పండుగలకు భారీగా నజరానాలు అందిస్తోంది.

కొటియాలోని అన్ని గ్రామాలను కలుపుతూ రహదారులు నిర్మించింది. కొటియా కొండ గ్రామాల్లో ఎటు చూసిన అందమైన రోడ్లు కనిపిస్తాయి. వీటితో పాటు మరికొన్ని గ్రామాలకు కూడా ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టింది. ఆసుపత్రి, పోలీస్‌ స్టేషన్, పాఠశాల, ఆశ్రమ పాఠశాల ఇలా అనేక సౌకర్యాలను ఏర్పాటు చేసింది.

ఒక వైపు కొటియా గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తున్నా... మావోయిస్టుల కదలికలు కూడా ఉన్నాయి. దీంతో ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్లు, తరచూ స్థానికుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తుంటారు పోలీసులు.

"కొటియా గ్రామాల్లో అభివృద్ది, మౌలిక వసతులు కనిపిస్తున్న మాట వాస్తవమే. డోలియాంబ, ముడకారు, కొటియా, గంజాయిభద్ర తదితర గ్రామాల్లో తాజాగా ఒడిశా వేసిన రహదారులు కనిపిస్తున్నాయి. ఈ గ్రామాలపై యథాతథస్థితిని పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, గత ఏడాది కాలంలో ఒడిశా సర్కారు ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తూ వచ్చింది. కనీసం దీనిని అపేందుకైనా ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. స్థానికులతో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్‌ అధికారులు ఇటీవలి కాలంలో తమ గ్రామాల దిక్కే చూడలేదని వారు చెప్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం శ్రద్ధ చూపి, కొటియా గ్రామాలను కాపాడుకోపాడుకోవాలిసన అవసరం ఉంది" అని విజయనగరం జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున బీబీసీతో అన్నారు.

కొటియా గ్రామాలు

'కొటియా అభివృద్ధే లక్ష్యం’

గత నాలుగైదు నెలలుగా కొటియా నిత్యం వార్తాంశాల్లో ఉంటుంది. పైగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం కూడా రాజుకునే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు కొటియా పర్యటనలు చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్తున్నారు. "ప్రస్తుతం కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. అంతా సజావుగా ఉంది. అధికారులు నిరంతరం గ్రామాలకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నారు. అక్కడ ప్రజలు అధికారులకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. నేను కొటియా గ్రామాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. త్వరలోనే కొటియా ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడతాను" అని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ చెప్పారు. "కొటియా భౌగోళికంగా ఒడిశాకే చెందుతుంది. కోరాపూట్ జిల్లాలో భాగమే కొటియా గ్రామాలు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి హక్కులూ లేవు. 1951లోనే ఒడిశా ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించింది. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కొటియా మాది అనడం హాస్యాస్పదం. దీనిపై ఇటీవలే సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. ఇప్పటీకే కొటియా గ్రామాల్లో చాలా అభివృధ్ది చేసి చూపించాం. కొటియా గ్రామాల అభివృద్ధి, అక్కడి గిరిజనుల బాగోగుల కోసం కొటియా ప్రాంతంలో ఒడిశా అభివృద్ది పనులు నిరంతరం సాగుతూనే ఉంటాయి " అని ఒడిశా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మెన్ సంజయ్ దాస్ వర్మ మీడియాతో చెప్పారు.

అయితే తాజాగా శుక్రవారం ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. తమ రాష్ట్రానికి చెందిన పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని, అందులో మూడు పంచాయతీల పేర్లు మార్చారని ఒడిశా ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ ధర్మాసనం ఏపీ తరఫు న్యాయవాదికి పిటిషన్ కాపీ అందించాలని సూచించింది. దానిపై వచ్చే వారంలోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

అలాగే ఈ ఫిబ్రవరి 13న జరిగే రెండో విడత ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
These 34 villages on the Andhra-Odisha border belong to which state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X