కొంప ముంచిన ఈశ్వరప్ప, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ, మాజీ సీఎంకు సినిమా కష్టాలు !
లోక్‌సభ ఎన్నికల ఫీవర్ రోజురోజుకూ పెరుగుతోంది, కర్ణాటకలోని హవేరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తన కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ రాష్ట్ర మాజీ డీసీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడం కలకలం రేపింది.
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, శివమొగ్గ సిట్టింగ్ ఎంపీ బీవై రాఘవేంద్రను దెబ్బ కొట్టడానికి ఈశ్వరప్ప స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యడంతో స్థానిక బీజేపీ నాయకులు హడలిపోయారు. శివమొగ్గలోని బంజారా కన్వెన్షన్ హాల్‌లో మాజీ మంత్రి, కురుబ సంఘం నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప తన మద్దతుదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొన్ని గంటల పాటు వారితో చర్చించారు.

కేవలం ఒకే కుటుంబం చేతిలో ఇరుక్కున్న బీజేపీని విడిపించేందుకే తాను శివమొగ్గలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని నిర్ణయించానని ప్రకటించిన ఈశ్వరప్ప కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తీరుపై మండిపడ్డారు. ఇప్పటికీ తాను శివమొగ్గలో బాధిత బీజేపీ కార్యకర్తల గొంతుకగా నిలవాలని స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఈశ్వరప్ప మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై చేస్తున్న పోరులో భాగంగా ఆయన కొడుకు మీద శివమొగ్గ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు.
మీ కొడుకును ఎంపీని చేశారు, మరో కొడుకును కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని చేశారు, ఒకరు ఎంపీగా మరో వ్యక్తి ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు, అయితే తన కొడుక్కి మాత్రం ఎంపీ సీటు రాకుండా అడ్డుకుంటారా అంటూ బీఎస్ యడియూరప్ప మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేఎస్. ఈశ్వరప్ప మీ కథ చూస్తానని యడియరప్పను హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తాను వెళ్లలేనని, నా ప్రాణాలు పోయినా తాను మోదీకి వ్యతిరేకంగా పని చెయ్యనని, నా ఛాతీని చీల్చితే ఒక పక్క శ్రీరాముడు, మరో పక్క మోదీ కనిపిస్తారని ఈశ్వరప్ప అన్నారు.

అదే యడ్యూరప్ప ఛాతీ చీల్చితో ఒక పక్క ఇద్దరు కొడుకులు, మరో వైపు, శోభా కరంద్లాజే ఉన్నారని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారని కర్ణాటక మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భారతదేశం నా కుటుంబం అని మోదీ అన్నారు. అయితే మోదీ ప్రకటన చూసిన తరువాత కూడా కర్ణాటకలో ఇలా జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి అని ఈశ్వరప్ప ప్రశ్నించారు. నేను ఎంపీ టిక్కెట్లు ఇస్తానని యడ్యూరప్ప అందరికీ చెప్పారని ఈశ్వరప్ప ఆరోపించారు.
అయితే తన కొడుకు విషయంలో ఎందుకు మాకు ద్రోహం చేశారు, నేను స్వార్థం కోసం ఈ మీటింగ్ పెట్టలేదని ఈశ్వరప్ప అన్నారు. కేంద్రంలో బీజేపీ పెద్దలకు హామీ ఇచ్చినట్లు ముందు మీరు శోభా కరంద్లాజేని గెలిపించండి చూద్దాం అంటూ కేఎస్ ఈశ్వరప్ప మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు సవాలు విసిరారు. మొత్తం మీద స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన కేఎస్. ఈశ్వరప్ప మీద బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని బీజేపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications