కర్నాటకీయం: కుమారస్వామి వ్యాఖ్యలు దేనికి సంకేతం..? బీజేపీ జోస్యం నిజం కాబోతోందా..?
బెంగళూరు:కర్నాటకలో ప్రభుత్వం ప్రమాదంలో పడిపోయిందా..? కుమారస్వామి ప్రభుత్వానికి గండం తప్పదా..? బీజేపీ చెబుతున్నట్లుగా త్వరలోనే మళ్లీ అక్కడ అధికారం చేపడతామని చెబుతున్న కమలనాథుల మాటలు నిజం కానున్నాయా..? జేడీఎస్-కాంగ్రెస్‌ల పొత్తు వికటిస్తోందా.. కుమారస్వామి వ్యాఖ్యలు దేనికి సంకేతం...?

కర్నాటకలో ప్రారంభమైన రాజకీయ చదరంగం
కర్నాటకలో మళ్లీ రాజకీయ చదరంగం ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పుపొంచి ఉన్నట్లుగా అక్కడి పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్న వారు చెబుతున్నారు. ఇప్పటికే కుమారస్వామి ప్రభుత్వంపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో బీజేపీతో టచ్‌లో కూడా ఉన్నారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం నడపడం దినదిన గండంగా మారింది. ఎప్పుడు ఏ కాంగ్రెస్ నేత వ్యతిరేక జెండా ఎగురవేస్తారో అనే టెన్షన్ కుమారస్వామికి తలనొప్పిగా మారింది. దీంతో కర్నాటకలో పాలన గాడి తప్పిందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్‌పై కుమార స్వామి అసంతృప్తి..?
కాంగ్రెస్-జేడీఎస్‌ల బంధం బలహీనపడుతోంది. కుమారస్వామి మాటలు చూస్తుంటే దీనికి బలం చేకూరుస్తున్నాయి. ప్రతిరోజు కాంగ్రెస్‌తో వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ కుమారస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోరికలు అన్ని తీర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెబుతూనే వారితో మానసికంగా కృంగిపోతున్నానంటూ వ్యాఖ్యలు చేశారు కుమారస్వామి. కాంగ్రెస్ వ్యవహారంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పుతోందని చెప్పిన కుమారస్వామి... ప్రజల సమస్యలు కూడా పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వాన్ని స్మూత్‌గా నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తుచేశారు.

బీజేపీ పావులు కదిపితే అక్కడి ప్రభుత్వం ఔటేనా..?
కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కర్నాటక ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన చేస్తుందని ... ప్రభుత్వం పడిపోతుందనే వార్తల్లో నిజం లేదని అన్నారు. ఇక బీజేపీ కర్నాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న మాట వాస్తవమే కానీ.. ఈ ప్రయత్నంలో వారు విజయం సాధించలేరని ధీమా వ్యక్తం చేశారు సిద్ధరామయ్య. బయటకు సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ జేడీఎస్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకరిపై ఒకరు మాటలతూటాలు పేల్చుకుంటున్నారు. దీంతో సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాను సీఎంగా ఉండటం సంతృప్తికరంగా లేదని కొద్దిరోజుల క్రితం కుమారస్వామి వ్యాఖ్యానించారు.సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టమైన పని అని అదేసమయంలో ఇబ్బందులతో కూడిన పని అని చెప్పుకొచ్చారు. జేడీఎస్ మరియు కాంగ్రెస్‌లు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెల్చుకున్న అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో జేడీఎస్ కాంగ్రెస్‌లు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.












Click it and Unblock the Notifications