రాష్ట్ర హోదా ఉద్యమం హింసాత్మకం: 4గురు మృతి, 30 మందికి గాయాలు
Ladakh Violence: లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ హోదాను డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో లేహ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనల అనంతరం ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తమ 15 రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు మరణించగా.. 30 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
నిరసనలు.. హింసాత్మక ఘటనలు
లడఖ్ అపెక్స్ బాడీ యువజన విభాగం పిలుపు మేరకు లేహ్ లో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. అయితే నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహించిన నిరసనకారులు లేహ్‌లోని బీజేపీకార్యాలయానికి నిప్పు పెట్టారు. అంతేకాకుండా పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వి, అల్లర్లు సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బాష్పవాయువు షెల్స్ ప్రయోగించడంతోపాటు, లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి.

అధికార యంత్రాంగం చర్యలు
శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో లేహ్ జిల్లా యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. జిల్లా మేజిస్ట్రేట్ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించే భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని సెక్షన్ 163ను విధించారు. ముందుగా అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడానని కూడా నిషేధించారు. ఈ చర్యలు ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను కాపాడటానికి అవసరమని లేహ్ జిల్లా యంత్రాంగం పేర్కొంది.
#WATCH | Leh, Ladakh: BJP Office in Leh set on fire during a massive protest by the people of Ladakh demanding statehoothe d and the inclusion of Ladakh under the Sixth Schedule turned into clashes with Police. https://t.co/yQTyrMUK7q pic.twitter.com/x4VqkV8tdd
— ANI (@ANI) September 24, 2025
సోనమ్ వాంగ్‌చుక్ స్పందన
నిరసనలు హింసాత్మకంగా మారడంపై సోనమ్ వాంగ్‌చుక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "లేహ్‌లో విధ్వంసం జరిగిందని, అనేక కార్యాలయాలు, పోలీసు వాహనాలు ధ్వంసం చేయబడ్డాయని, వాటికి నిప్పు పెట్టబడ్డాయని నేను చాలా బాధతో తెలియజేస్తున్నాను" అని ఆయన అన్నారు. ఇది "యువత ఆగ్రహం, ఒక జెన్-జెడ్ విప్లవం" అని అభివర్ణించిన ఆయన.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
డిమాండ్లు.. తదుపరి చర్యలు
2019లో జమ్మూకశ్మీర్ నుంచి లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా వేరు చేసినప్పటి నుంచి లడఖ్ ప్రజలు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక స్వయంప్రతిపత్తిని కల్పిస్తుంది. తద్వారా స్థానిక సంస్కృతి, భూమి, వనరులను పరిరక్షించుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఈ డిమాండ్లపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, లడఖ్ ప్రతినిధులు, లడఖ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులతో అక్టోబర్ 6న మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు మాజీ ఎంపీ, లడఖ్ అపెక్స్ బాడీ ఛైర్‌పర్సన్ తుప్‌స్తాన్ ఛేవంగ్ నాయకత్వం వహించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications