చిత్రహింసలకు గురిచేసి మహిళా ప్రొఫెసర్ దారుణ హత్య
కోయంబత్తూరు: తమిళనాడులోని రాష్ట్రంలోని కినతుకడవులో దారుణం చోటు చేసుకుంది. అక్షయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మహిళను కొందరు దుండగులు చిత్రహింసలకు గురి చేసి హతమార్చారు. ఈ మేరకు వివరాలను కరమడాయి పోలీసులు తెలిపారు. బాధితురాలు బిటెక్ పూర్తి చేసిందని, ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ కలిగి ఉందని చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు గురైన డి రమ్య(24) తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, 2013లో అక్షయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరింది. రమ్య తల్లి డి మాలతి(48) గృహిణి కాగా, ఆమె తండ్రి ధర్మరాజ్(50) నీలగిరి జిల్లాలోని కోటగిరిలోని తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పని చేస్తున్నారని పోలీసులు చెప్పారు.
కోయంబత్తూరుకు 35కిలోమీటర్ల దూరంలోని కరమడాయిలో ధర్మరాజ్‌కు సొంత ఇల్లు ఉంది. అక్కడే ధర్మరాజుతోపాటు అతని భార్య మాలతి, కూతురు రమ్య, తల్లి రంగమ్మ నివాసం ఉంటున్నారు. విధులకు హాజరయ్యేందుకు ధర్మరాజు సోమవారం ఇంటి నుంచి బయల్దేరాడు.

సోమవారం సాయంత్రం రంగమ్మ మెట్టుపాళేంలోని తన బంధువు ఇంటికి వెళ్లింది. మంగళవారం ఉదయం కోటగిరి నుంచి ధర్మరాజు అతని భార్యకు ఫోన్ చేశాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మంగళవారం సాయంత్రం 3గంటలకు ఇంటికి చేరుకున్న ధర్మరాజు, తన కూతురు రమ్య రక్తమడుగులో విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించాడు. పక్కనే మాలతి కూడా తలకు తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో పడివుంది.
తీవ్ర ఆవేదనకు, భయాందోళనకు గురైన ధర్మరాజు పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మాలతికి అత్యవసర చికిత్సను వైద్యులు అందించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
కోయంబత్తూరు రేంజ్ డిఐజి అయుష్ మణి తివారీ, ఎస్పీ సుధాకర్, స్థానిక పోలీసులు ఘటనపై స్థానికులను ప్రశ్నించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించారు. స్నిఫ్ఫర్ డాగ్స్‌తో ఘటనా స్థలాన్ని తనిఖీ చేయించారు. ఇంట్లో ఆభరణాలు, నగదు దొంగతనానికి గురికాలేదని పోలీసులు చెప్పారు.
బాధితులపై అత్యాచారం జరిగినట్లు కూడా ఎలాంటి అనవాలు లేవని పోలీసులు తెలిపారు. రమ్యను ఎవరో దుండగులు కత్తులతో తీవ్రంగా పొడిచి హత్య చేశారని పోలీసులు చెప్పారు. నిందితులు ఆమెను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని పోలీసులు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications