విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్లమెంటా, పంచాయతీయా: కాంగ్రెసుపై లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనపై దాడి జరగడం కొత్త కాదని, గతంలో కూడా తనపై దాడులు జరిగాయని బహిష్కృత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. దాడుల నుంచి ఆత్మరక్షణ చేసుకోవడానికి తాను పెప్పర్ స్ప్రే దగ్గర ఉంచుకుంటున్నట్లు ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆత్మరక్షణ కోసమే తాను పెప్పర్ స్ప్రే కొట్టినట్లు ఆయన తెలిపారు. తన వద్ద ఉన్న పెప్పర్ స్ప్రే ఏ విధమైన హాని చేయదని ఆయన అన్నారు.

ఆత్మరక్షణ కోసమే తాను లోకసభలో పెప్పర్ స్ప్రే కొట్టినట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాడి జరుగుతుంటే అడ్డుకోవడానికి తాను వెళ్లానని, దాంతో తనపై దాడికి దిగారని, ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే కొట్టానని ఆయన అన్నారు. కాంగ్రెసు, యుపిఎ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.

Lagadapati says will stop bifurcation of AP

బిల్లును వ్యతిరేకించడానికి తాము వెల్‌లోకి వెళ్లామని, బిల్లుకు అనుకూలమని చెబుతున్నవారు సీట్లలో కూర్చోకుండా వెల్‌లోకి వచ్చారని, వంద మంది ఎంపీలు వెల్‌లోకి వచ్చారని ఆయన అన్నారు. తమను మాత్రమే సస్పెండ్ చేయడం సరి కాదని, వెల్‌లోకి వచ్చిన వంద మందిని కూడా సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాల దయాదాక్షిణ్యాల మీద నడుస్తోందని, ప్రతిపక్షాలకు అధికారంలోకి రావాలనే ఉద్దేశం లేదని, దాంతో తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన అన్నారు.

పార్లమెంటా, పంచాయతీయా అనేది కాలమే చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వానికి సంఖ్యా బలం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షం కన్నెర్ర చేస్తే పడిపోయే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. తమకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు చాలా తమకు మద్దతు ఇస్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ చాలా మంది తమకు మద్దతుగా నిలిచారని ఆయన అన్నారు. సొంత పార్టీ ఎంపీలతో, మంత్రులతో మాట్లాడకుండా ప్రతిపక్ష బిజెపితో మాట్లాడుకుంటున్నారని ఆయన కాంగ్రెసుపై, యుపిఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

అధికారం ఇచ్చారు కాబట్టి తాము ఏమైనా చేస్తామంటే తాము చేతులు కట్టుకుని కూర్చోలేదని చెప్పడానికి ప్రయత్నిస్తే తమది తప్పయిందా అని ఆయన అన్నారు. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయించే బాధ్యతను సీమాంధ్ర కేంద్ర మంత్రులపై పెట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లును అడ్డుకుని తీరుతామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ఆయన అన్నారు. ఎంపిలను ఉసిగొలిపి కాంగ్రెసువారు వెల్‌లోకి పంపించారని, స్పీకర్ కూడా పక్షపాతంతో వ్యవహరించారని ఆయన అన్నారు.

English summary
Expelled Congress Vijayawada MP Lagadapati Rajagopal questioned that was it Parliament or Panchayath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X