లక్షద్వీప్ వెళ్లాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్
Lakshadweep: ద్వీపదేశం మాల్దీవులతో తలెత్తిన ఘర్షణ వైఖరిని అవకాశంగా మలచుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. మాల్దీవులకు పోటీగా మనదేశ పరిధిలో ఉండే లక్షద్వీప్‌లో పర్యటకరంగానికి ఊతం ఇచ్చే నిర్ణయాలను తీసుకుంటోంది. పర్యాటకుల తాకిడి భారీగా పెరుగుతోండటంకూడా దీనికి కారణమౌతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. సముద్రపు ఒడ్డున దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ఒక ఎత్తయితే.. ఈ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల పట్ల చెలరేగిన దుమారం మరో ఎత్తు. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది మాల్దీవ్స్ ప్రభుత్వం.

మోదీ పర్యటన తరువాత లక్షద్వీప్‌కు డిమాండ్ పెరిగింది. మాల్దీవులపై నెలకొన్న వ్యతిరేకత దీనికి మరింత దోహదం చేసినట్టయింది. మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌ను సందర్శించాలనుకునే పర్యాటకుల సంఖ్య మున్ముందు భారీగా పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో- లక్షద్వీప్‌లో కొత్తగా మరో విమానాశ్రయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. యుద్ధ ప్రాతిపదికన దీన్ని నిర్మించాలని భావిస్తోంది. కమర్షియల్ ఆపరేషన్స్‌తో పాటు సైనిక అవసరాల కోసం కూడా ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చింది కేంద్రం.
ప్రస్తుతం లక్షద్వీప్‌లోని అగట్టీలో విమానాశ్రయం, కవరట్టిలో హెలిప్యాడ్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటితో పాటు మినికాయ్ ఐలండ్స్‌లో ఈ కొత్త ఎయిర్ పోర్ట్ నిర్మించాలని యోచిస్తోంది. మాల్దీవులకు సమీపంలో ఉంటుంది ఈ మినికాయ్ ఐలండ్స్. భవిష్యత్తులో ఏర్పడే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి మినికాయ్ ఐలాండ్స్‌లో ఎయిర్ పోర్ట్ అవసరమని కేంద్రం నిర్ణయించుకుంది.
పౌర విమానయాన సర్వీసులతో పాటు సైనిక అవసరాలకు అనుగుణంగా మినికాయ్ ఐలాండ్స్‌లో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించేలా ప్రతిపాదనలను రూపొందించాలంటూ సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఆదేశాలను ఇచ్చింది. మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్ టేకాఫ్, ల్యాండింగ్ తీసుకోవడానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది.












Click it and Unblock the Notifications